Cancer: ఒక్క క్యాన్సర్ కణం వున్నా కూడా పసిగట్టే టెక్నాలజీ.. అందుబాటులోకి కొత్త బ్లడ్ టెస్ట్

New blood test can detect monitor lung cancer in real time
  • ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించేందుకు యూకేలో కొత్త రక్త పరీక్ష
  • FT-IR మైక్రోస్కోపీతో రక్తంలో క్యాన్సర్ కణాల గుర్తింపు
  • తొలి దశలోనే వ్యాధి నిర్ధారణతో మెరుగైన చికిత్సకు అవకాశం
  • ఇతర క్యాన్సర్ల గుర్తింపునకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడే ఛాన్స్
ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలో యూకే పరిశోధకులు ఒక విప్లవాత్మక ముందడుగు వేశారు. కేవలం రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ క్యాన్స‌ర్ క‌ణాల‌ను ముందుగానే పసిగట్టి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు మార్గం సుగమం అవుతుంది.

యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ నార్త్ మిడ్‌లాండ్స్ (UHNM), కీలే, లాఫ్‌బరో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. వీరు "ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ (FT-IR) మైక్రోస్కోపీ" అనే టెక్నిక్‌ను ఉపయోగించి రక్తంలో ఒక్క క్యాన్సర్ కణం వున్నా కూడా దానిని విజయవంతంగా గుర్తించారు. రక్తంలో తిరుగుతూ ఉండే క్యాన్సర్ కణాలను (సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ - CTCs) ఈ పద్ధతి పసిగడుతుంది. ఈ కణాలు కణితి నుంచి విడిపోయి రక్తంలో ప్రయాణిస్తూ ఇతర భాగాలకు వ్యాధిని వ్యాపింపజేస్తాయి.

ఈ టెక్నాలజీలో రక్త నమూనాపై శక్తిమంతమైన ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేస్తారు. క్యాన్సర్ కణాలు ఈ కాంతిని ప్రత్యేకమైన రీతిలో గ్రహిస్తాయి. దీనివల్ల వాటికంటూ ఒక "కెమికల్ ఫింగర్‌ప్రింట్" ఏర్పడుతుంది. కంప్యూటర్ విశ్లేషణ ద్వారా ఈ ఫింగర్‌ప్రింట్‌ను గుర్తించి రక్తంలో క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఉన్న పద్ధతులతో పోలిస్తే ఇది చాలా సులభం, వేగవంతమైనది, ఖర్చు కూడా తక్కువ.

"ఈ విధానం వల్ల రోగులకు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, వారికి తగ్గట్టుగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఈ టెక్నిక్‌ను ఊపిరితిత్తుల క్యాన్సర్‌కే కాకుండా ఇతర రకాల క్యాన్సర్ల నిర్ధారణకు కూడా విస్తరించే అవకాశం ఉంది" అని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జోసెప్ సులే-సుసో తెలిపారు. ఈ పరిశోధన వివరాలు "అప్లైడ్ స్పెక్ట్రోస్కోపీ" జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, ఈ పరీక్షను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Cancer
Lung Cancer
Cancer detection
Blood test
FT-IR Microscopy
Circulating Tumor Cells
UHNM
Keele University
Loughborough University
Cancer diagnosis
Joseph Sule-Suso

More Telugu News