Sajid Akram: సిడ్నీ ఉగ్రదాడికి పాల్పడింది హైదరాబాదీనే.. 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వలస!

Sajid Akram Hyderabad man in Sydney terror attack
  • ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడికి హైదరాబాద్ మూలాలు
  • 15 మందిని పొట్టనబెట్టుకున్న తండ్రీకొడుకులు
  • దర్యాప్తులో కీలక విషయాలు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీవ్ర కలకలం రేపిన సామూహిక కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడికి హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు తేలింది. ఆదివారం బాండీ బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరిలో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో సాజిద్ మరణించగా, అతనితో పాటు దాడిలో పాల్గొన్న కుమారుడు నవీద్ అక్రమ్ (24) గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత ఉగ్రదాడి అని ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.

తెలంగాణ డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వాస్తవ్యుడు. ఇక్కడే బీకాం పూర్తి చేసి, ఉద్యోగం కోసం 1998 నవంబర్‌లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత 27 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న అతనికి హైదరాబాద్‌లోని కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేవు. చివరిసారిగా 2022లో హైదరాబాద్ వచ్చి వెళ్లాడు. కుటుంబ కలహాల కారణంగా బంధువులు చాలాకాలం క్రితమే అతనితో సంబంధాలు తెంచుకున్నారు. 2017లో తండ్రి చనిపోయినప్పుడు కూడా సాజిద్ రాలేదని పోలీసులు తెలిపారు. అతని రాడికలైజేషన్‌కు, భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా వెళ్లాక సాజిద్ యూరోపియన్ మహిళ వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉన్నారు. వారంతా ఆస్ట్రేలియా పౌరులు కాగా, సాజిద్ మాత్రం భారత పాస్‌పోర్ట్‌నే కొనసాగిస్తున్నాడు.

దాడి జరిగిన తీరుపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ మాట్లాడుతూ, "ఇది ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి. వయసుతో సంబంధం లేకుండా కేవలం మరణాల సంఖ్య పెంచడమే లక్ష్యంగా నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు" అని తెలిపారు. నిందితులు వాడిన వాహనంలో పేలుడు పదార్థాలు, ఐసిస్ జెండాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

దాడికి నెల రోజుల ముందు నిందితులు ఫిలిప్పీన్స్‌లో పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది. నవంబర్ 1 నుంచి 28 వరకు వారు అక్కడ ఉన్నారు. సాజిద్ భారత పాస్‌పోర్ట్‌పైనా, నవీద్ ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్‌పైనా ప్రయాణించినట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. ఇస్లామిక్ గ్రూపులకు పట్టున్న మిండనావో ద్వీపంలోని దవావో నగరానికి వారు వెళ్లినట్లు తేలింది. ఈ పర్యటన ఉద్దేశంపై ఆస్ట్రేలియా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Sajid Akram
Sydney attack
Australia
Hyderabad
ISIS
Islamic State
Bondi Beach
Telangana
Radicalization

More Telugu News