టైమ్స్ మ్యాగజైన్ పై ఏంజెలినా జోలీ సంచలన ఫొటో.. శస్త్ర చికిత్స చిహ్నాలను బహిర్గతం చేసిన నటి
- రొమ్ము క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్న మహిళలకు ధైర్యం ఇచ్చేందుకేనని వెల్లడి
- క్యాన్సర్ ముప్పు తప్పించుకోవడానికి ముందస్తు చికిత్స చేసుకున్న జోలీ
- ఆ ఆపరేషన్ కోసం తన శరీరంపై పెట్టిన గాట్లను బయటపెట్టిన నటి
ఏంజెలినా జోలీ తల్లి, నటి మార్షెలిన్ బెర్ట్రాండ్ రొమ్ము క్యాన్సర్ బారిన పడి 56 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా తనకూ వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఏంజెలినా జోలీ ముందస్తు చికిత్స తీసుకున్నారు. సుదీర్ఘ సంఘర్షణ తర్వాత మాస్టెక్టమీ ద్వారా రొమ్ములను తొలగించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఆపరేషన్ తర్వాత తాను మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు జోలీ తెలిపారు. ఇప్పటికీ చాలామంది మహిళలు తమకు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఉందని తెలిసినా మాస్టెక్టమీకి సిద్ధపడరని చెప్పారు. వారికి ధైర్యం కల్పించేందుకు, ఆపరేషన్ కోసం వారు ముందుకు వచ్చేలా చేయడానికి తాను ఈ ఫొటోషూట్ కు అంగీకరించానని జోలీ వివరించారు.