Amanda Reynolds: పెంపుడు కుక్క తన కూతురు లాంటిదంటూ కోర్టుకెక్కిన మహిళ!

Woman Sues IRS to Declare Pet Dog a Dependent in US
  • పెంపుడు కుక్కను డిపెండెంట్‌గా గుర్తించాలని అమెరికాలో దావా
  • కుక్క కోసం ఏటా రూ. 4.5 లక్షలు ఖర్చు చేస్తున్నానన్న మహిళ
  • పెంపుడు జంతువులు ఆస్తి కాదు, కుటుంబ సభ్యులని వాదన
అమెరికాలో ఓ ఆసక్తికరమైన కేసు నమోదైంది. తన పెంపుడు కుక్కను చట్టపరంగా తనపై ఆధారపడిన 'డిపెండెంట్'గా గుర్తించాలని కోరుతూ అమండా రేనాల్డ్స్ అనే మహిళ అక్కడి పన్నుల విభాగం (ఐఆర్ఎస్)పై దావా వేశారు. తన ఎనిమిదేళ్ల గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క ఫిన్నెగన్ మేరీ రేనాల్డ్స్‌కు ఆహారం, నివాసం, వైద్య సంరక్షణ వంటి అన్ని అవసరాలను తానే చూసుకుంటున్నానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఫోర్బ్స్ కథనం ప్రకారం తన కుక్క కోసం ఏటా 5,000 డాలర్లకు పైగా (సుమారు రూ. 4.5 లక్షలు) ఖర్చు చేస్తున్నానని, ఇది ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ సెక్షన్ 152 ప్రకారం 'డిపెండెంట్' నిర్వచనానికి సరిపోతుందని ఆమె వాదిస్తున్నారు. పెంపుడు జంతువులను 'ఆస్తి'గా పరిగణించే ప్రస్తుత చట్టాలు... వాటిని పిల్లల మాదిరిగా పెంచుకుంటున్న యజమానుల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని అమండా తెలిపారు.

"అన్ని విధాలా ఫిన్నెగన్ నాకు కూతురు లాంటిది, కచ్చితంగా నాపై ఆధారపడిన డిపెండెంట్" అని అమండా తన దావాలో పేర్కొన్నారు. ఈ కేసు విచిత్రంగా అనిపించినా, ఇది అర్థరహితమైనది ఏమీ కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే సర్వీస్ డాగ్స్ వంటి కొన్ని జంతువులకు పరిమిత పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు, సాధారణ పెంపుడు జంతువులకు ఆ హోదా ఇవ్వకపోవడం పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం మోపడమేనని ఆమె వాదించారు.

అయితే, ఈ కేసులో ఐఆర్ఎస్ కొట్టివేత పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తూ మేజిస్ట్రేట్ జడ్జి జేమ్స్ ఎం. విక్స్ ప్రస్తుతానికి విచారణ ప్రక్రియను నిలిపివేశారు. కాగా, 2023 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం అమెరికాలో 62 శాతం మంది ప్రజలు పెంపుడు జంతువులను కలిగి ఉండగా, వారిలో 97 శాతం మంది వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని తేలింది.
Amanda Reynolds
pet dog
Internal Revenue Service
tax deduction
dependent
Finnegan Mary Reynolds
US law
pet ownership
service dog
animal rights

More Telugu News