Chandrababu Naidu: నేడు ఏపీలో కలెక్టర్ల సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న సీఎం

Chandrababu Naidu Reviews 18 Months of Governance at AP Collectors Conference
  • 18 నెలల ప్రభుత్వ పనితీరుపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు
  • సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండా
  • రెండో రోజు ఎస్పీలతో శాంతిభద్రతలపై ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

సమావేశంలో తొలిరోజు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), కీలక పనితీరు సూచికలు (కేపీఐఎస్), అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఈ-ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం పలు సూచనలు చేయనున్నారు.

రెండో రోజైన గురువారం వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్‌పై కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. స్వర్ణ ఆంధ్ర @ 2047, నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి డీజీపీ, జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంతో రెండు రోజుల సదస్సు ముగియనుంది. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Collectors Conference
GSDP
KPIs
Super Six Schemes
E-Office
Investments AP
Swarna Andhra 2047
Skill Development

More Telugu News