Donald Trump: మరో 7 దేశాలపై అమెరికా పూర్తి నిషేధం.. జాబితాలో పాలస్తీనియన్లు

Donald Trump Imposes Full Travel Ban on 7 More Countries Including Palestinians
  • 15 దేశాలపై పాక్షికంగా ప్రయాణ ఆంక్షలు
  • నిషేధిత దేశాల జాబితా 39కి పెంపు
  • జాతీయ భద్రత, వీసా ఉల్లంఘనలే కారణమన్న వైట్‌హౌస్
  • జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
అమెరికా తన ప్రయాణ ఆంక్షల జాబితాను మరింత విస్తరించింది. జాతీయ భద్రత, వీసా నిబంధనల ఉల్లంఘనలను కారణంగా చూపుతూ మరో 7 దేశాలతో పాటు, పాలస్తీనియన్లపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధం విధించింది. మరో 15 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక ప్రకటనపై సంతకం చేశారు. ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ తాజా నిర్ణయంతో అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల సంఖ్య మొత్తం 39కి చేరింది. కొత్తగా పూర్తి నిషేధం ఎదుర్కొంటున్న దేశాల్లో బుర్కినా ఫాసో, మాలి, నైగర్, దక్షిణ సూడాన్, సిరియా ఉన్నాయి. వీటితో పాటు పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. గతంలో పాక్షిక ఆంక్షలు ఎదుర్కొన్న లావోస్, సియెర్రా లియోన్‌లపై ఇప్పుడు పూర్తి నిషేధం విధించారు.

ఇటీవల వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులను ఆఫ్ఘన్ జాతీయుడు హత్య చేయడం, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక పౌర ఉద్యోగి మరణించడం వంటి ఘటనల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వలస విధానాలను కఠినతరం చేయాలనే తమ వాదనకు ఈ ఘటనలు బలం చేకూర్చాయని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.

ఇక పాక్షిక ఆంక్షలు విధించిన 15 దేశాల జాబితాలో అంగోలా, నైజీరియా, సెనగల్, టాంజానియా, జింబాబ్వే వంటి దేశాలు ఉన్నాయి. క్రియాశీల ఉగ్రవాద ముప్పు, అంతర్గత ఘర్షణలు, వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఇప్పటికే చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారికి, వీసాలు కలిగి ఉన్నవారికి, దౌత్యవేత్తలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
Donald Trump
US travel ban
travel restrictions
Burkina Faso
Mali
Niger
South Sudan
Syria
Palestinians
visa violations

More Telugu News