Telangana Weather: గజగజలాడుతున్న తెలంగాణ .. 7.4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Telangana Shivers as Temperatures Drop to 74 Degrees
  • తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
  • రాష్ట్రంలోని చాలా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • రేపటి నుంచి మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు గజగజలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వివిధ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 7.9 డిగ్రీలు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శేరిలింగంపల్లిలో 10, మల్కాజిగిరిలో 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గకపోవడం, సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ రహదారులను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని తెలిపింది. ఏడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 6 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Telangana Weather
Telangana
Hyderabad
Cold Wave
Weather Forecast
Sangareddy
Winter
Temperature
Orange Alert
Kohir

More Telugu News