Jagan Mohan Reddy: విజయవాడలో కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలి: జగన్

Jagan Mohan Reddy Demands CBI Probe into Vijayawada Demolitions
  • రూ.150 కోట్ల భూమి కోసమే పేదల ఇళ్లను కూల్చారని ఆరోపణ
  • సీఎం చంద్రబాబు, లోకేష్, స్థానిక ఎంపీ, కార్పొరేటర్‌పై తీవ్ర విమర్శలు
  • న్యాయస్థానం ఆదేశాలను సైతం పక్కనపెట్టి కూల్చివేశారని ఆగ్రహం
విజయవాడ నగరంలోని జోజి నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేశారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కూల్చివేతలకు గురైన బాధితులను పరామర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా, డిసెంబర్ 31 వరకు బాధితులకు ఊరట లభించినప్పటికీ, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేయడం దారుణమని అన్నారు.

ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... రూ.150 కోట్ల విలువైన 2.17 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ పత్రాలు సృష్టించి, 2016లో బ్యాక్ డేట్‌తో ఒక బోగస్ సొసైటీని రిజిస్టర్ చేసి, ఉద్దేశపూర్వకంగా న్యాయపరమైన వివాదాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ కూల్చివేతల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్, స్థానిక ఎంపీ, జనసేన కార్పొరేటర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

గత 25 ఏళ్లుగా చట్టబద్ధంగా నివసిస్తున్న 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు అన్ని అనుమతులు పొంది, బ్యాంకు రుణాలకు ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. అసలు ఆ భూమి వారిది కానప్పుడు ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు వివాదాస్పద భూములను గుర్తించి, వాటిపై కేసులు సృష్టించి, కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.

బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయసహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ అక్రమ కూల్చివేతలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలు, పెద్దల పాత్ర బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని జగన్ స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
Vijayawada demolitions
Joji Nagar
CBI investigation
Chandrababu Naidu
Nara Lokesh
illegal constructions
land grabbing
YSRCP
Andhra Pradesh politics

More Telugu News