Chandrababu Naidu: రాజకీయ రౌడీలు తయారయ్యారు... జాగ్రత్త!: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Against Political Rowdies
  • కొత్తగా ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామకపత్రాలు అందజేత
  • కేసులు అధిగమించి యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపిన సీఎం చంద్రబాబు
  • వివేకా హత్య కేసులో జరిగిన కుట్ర వల్లే 2019లో ఓడిపోయానని వ్యాఖ్య
  • రాజకీయ ముసుగులో నేరాలు చేసే రౌడీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచన
  • రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరిక 
యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామకాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో, రాజకీయ ముసుగులో నేరాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆయన గట్టిగా సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ పరేడ్‌ మైదానంలో కొత్తగా ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.

నాలుగేళ్లుగా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతకు న్యాయం చేశామన్నారు. "సంబంధిత నోటిఫికేషన్‌పై వేసిన కేసులను పరిష్కరించి, పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. నా హయాంలో ఇప్పటివరకు 23 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం" అని చంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు, ఆయన గుండెపోటుతో చనిపోయారని మొదట నేను కూడా నమ్మాను. కానీ మధ్యాహ్నానికి అది హత్య అని తెలిసింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు కడిగేశారు. ఈ విషయం స్థానిక సీఐకి తెలిసినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత 'నారాసుర రక్తచరిత్ర' అంటూ నా చేతికి కత్తిపెట్టి దుష్ప్రచారం చేశారు. ఆ కుట్రను ప్రజలు నమ్మడం వల్లే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాను. ఆ రోజు నేను మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే ఓడిపోయేవాడిని కాదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు విధి నిర్వహణలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని చంద్రబాబు హితవు పలికారు. గతంలో ఒక పాస్టర్ ప్రమాదంలో మరణిస్తే, దాన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని, కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిజం బయటపడిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఎంపికైన కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి తొమ్మిది నెలల పాటు శిక్షణ ప్రారంభం కానుంది.
Chandrababu Naidu
AP Police
Constable Jobs
YS Vivekananda Reddy Murder
Andhra Pradesh Police Recruitment
Pawan Kalyan
Vangalapudi Anitha
Political Rowdyism
Ganja Smuggling
Mega DSC

More Telugu News