Nara Lokesh: చంద్రబాబు ఢిల్లీ వెళితే సొంత కొడుకు వచ్చినంతగా వాజ్ పేయి సంతోషపడేవారు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Praises Vajpayees Relationship with Chandrababu
  • మచిలీపట్నంలో వాజ్ పేయి విగ్రహావిష్కరణ
  • హాజరైన  ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
  • దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి వాజ్ పేయి అని కితాబు
  • తనకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయినే అని వెల్లడి
  • తెలుగు జాతి అటల్ జీకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఉద్ఘాటాన
  • వాజ్ పేయి మార్గంలోనే ప్రధాని మోదీ పాలన సాగుతోందన్న లోకేశ్
తన జీవితాన్ని దేశానికే అంకితం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అని, ఆయన పేరు చెబితేనే నమ్మకం, అభివృద్ధి, సుపరిపాలన గుర్తుకు వస్తాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. భారతరత్న వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన 'అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన' బస్సు యాత్రలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. "చాలామంది నన్ను స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబులలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారని అడుగుతారు. కానీ ఒక మత్స్యకార గ్రామాన్ని అభివృద్ధి చేసిన సింగపూర్ ప్రధాని లీ క్వాన్ యూ, భారతదేశాన్ని సమైక్యంగా ముందుకు నడిపిన అటల్ బిహారీ వాజ్ పేయిలే నాకు స్ఫూర్తి" అని లోకేశ్ స్పష్టం చేశారు. 

సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో ఆచరణలో చూపిన గొప్ప వ్యక్తి వాజ్ పేయి అని, ఆయనకు రాజకీయంగా ప్రతిపక్షమే లేదని అన్నారు. చిన్న వయసులోనే కవిత్వానికి, దేశానికి తన జీవితాన్ని అంకితం చేసి, 18 ఏళ్లకే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు.

వాజ్ పేయి మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, తొలిసారి 13 రోజులకే మెజారిటీ లేకపోవడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశారని, ఆ తర్వాత ఆయనకు తిరుగులేకుండా పోయిందని లోకేశ్ వివరించారు. దేశ భద్రత కోసం పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించి, కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ దురాక్రమణను సమర్థంగా తిప్పికొట్టిన ధీశాలి అని ప్రశంసించారు. ఓ వైపు దేశ భద్రత, మరోవైపు అభివృద్ధికి ఆయన పెద్దపీట వేశారని తెలిపారు. 

స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశంలో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చారని, చంద్రబాబు కోరిక మేరకు టెలికాం రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, ఈనాడు మనం చూస్తున్న ఆధునిక విమానాశ్రయాలకు కూడా ఆయన సంస్కరణలే కారణమని అన్నారు.

వాజ్ పేయికి, చంద్రబాబుకు మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ఉండేదని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఢిల్లీకి వెళితే, సొంత కొడుకు వచ్చినంతగా వాజ్ పేయి ఆనందపడేవారు. 1998లోనే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడింది. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం వాజ్ పేయినే. ఐఎస్‌బీ, బీమా నియంత్రణ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు నిధులు కేటాయించారు. అందుకే తెలుగు జాతి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది" అని లోకేశ్ ఉద్ఘాటించారు.

వాజ్ పేయి చూపిన మార్గంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పయనిస్తున్నారని, అందుకే ఏపీలో ఇప్పుడు డబుల్ ఇంజన్ కాదు, బుల్లెట్ ట్రైన్ వేగంతో ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఆర్థికంగా ఎదగడమే కాకుండా, నైతిక విలువలు కూడా ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలపై బోధన ప్రారంభిస్తామని తెలిపారు. తన నియోజకవర్గం మంగళగిరిలో వాజ్ పేయి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ నేత సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Atal Bihari Vajpayee
Chandrababu Naidu
BJP
Machilipatnam
Andhra Pradesh
NDA
PVN Madhav
Double Engine Sarkar
Governance

More Telugu News