పీఎస్‌జీకి భారీ షాక్.. ఎంబాపెకు రూ. 550 కోట్లు చెల్లించాలన్న కోర్టు!

  • మాజీ క్లబ్‌తో వివాదంలో ఎంబాపెకు భారీ విజయం
  • కైలియన్ ఎంబాపెకు అనుకూలంగా కోర్టు తీర్పు
  • తీర్పును గౌరవిస్తామని, అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపిన పీఎస్‌జీ
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపెకు, అతని మాజీ క్లబ్ పారిస్ సెయింట్-జర్మెయిన్ (పీఎస్‌జీ)కు మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంబాపెకు చెల్లించాల్సిన 60 మిలియన్ యూరోల (సుమారు రూ. 550 కోట్లు) జీతాలు, బోనస్‌లను వెంటనే చెల్లించాలని పీఎస్‌జీని ఫ్రెంచ్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో పీఎస్‌జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

2024 ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల జీతంతో పాటు, కాంట్రాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన ఎథిక్స్ బోనస్, సైనింగ్ బోనస్‌ను పీఎస్‌జీ ఎగ్గొట్టిందని ఎంబాపె కోర్టును ఆశ్రయించాడు. వాస్తవానికి, ఎంబాపె 263 మిలియన్ యూరోలు నష్టపరిహారంగా కోరగా, కోర్టు 60 మిలియన్ యూరోలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. జీతాలు చెల్లించనప్పుడు ఇలాంటి తీర్పే వస్తుందని తాము ఊహించామని ఎంబాపె తరఫు న్యాయవాది తెలిపారు.

మరోవైపు, 2023లో సౌదీ అరేబియా క్లబ్ అల్-హిలాల్‌కు వెళ్లేందుకు ఎంబాపె నిరాకరించడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ పీఎస్‌జీ కూడా 240 మిలియన్ యూరోల కోసం ప్రతిదావా వేసింది. కాంట్రాక్ట్ పొడిగించకపోవడం, సౌదీ క్లబ్‌కు వెళ్లకపోవడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే పీఎస్‌జీ అతడిని ప్రీ-సీజన్ టూర్‌కు కూడా దూరం పెట్టింది.

కోర్టు తీర్పును గౌరవిస్తామని, అయితే అప్పీల్‌కు వెళ్లే హక్కును వినియోగించుకుంటామని పీఎస్‌జీ ఒక ప్రకటనలో తెలిపింది. 2017 నుంచి 2024 వరకు పీఎస్‌జీ తరఫున ఆడిన ఎంబాపె, ఆ క్లబ్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ (308 మ్యాచ్‌లలో 256 గోల్స్) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది వేసవిలో ఎంబాపె స్పానిష్ దిగ్గజం రియల్ మాడ్రిడ్‌కు ఫ్రీ ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన సంగతి తెలిసిందే.


More Telugu News