Pawan Kalyan: ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా నాన్న మాకు జీవితాన్నిచ్చారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Speech on Constable Jobs My Father Gave Us Life
  • కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
  • శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • కానిస్టేబుల్‌గా మొదలైన తన తండ్రి ప్రస్థానమే తనకు స్ఫూర్తి అని వెల్లడి
  • గత ప్రభుత్వ హయాంలో పెరిగిన గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపు
  • నియామక ప్రక్రియ పూర్తిచేసిన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు అభినందనలు
కూటమి ప్రభుత్వం ప్రజల మానప్రాణాల సంరక్షణకు, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన 6,100 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి తరతమ భేదాలకు తావుండదని, కొత్త కానిస్టేబుళ్లు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పవన్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. "నా తండ్రి కూడా కానిస్టేబుల్‌గానే ఉద్యోగ జీవితం ప్రారంభించారు. పనిలో నిబద్ధత, ఎదగాలన్న బలమైన కాంక్షతో ప్రమోషన్లు పొంది ఏఎస్ఐ స్థాయికి చేరుకున్నారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మాకు జీవితాన్నిచ్చారు, చదివించారు. ఆయన విలువలతో కూడిన ప్రస్థానమే మాకు స్ఫూర్తి. మీలా ఒక కానిస్టేబుల్‌గా ప్రారంభమైన మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టింది" అని తెలిపారు. కానిస్టేబుళ్లే పోలీస్ శాఖకు మూల స్తంభాలని, వారి ధైర్యమే శాఖకు జీవమని కొనియాడారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి శాంతిభద్రతలతోనే ముడిపడి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. "ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి పటిష్ఠమైన శాంతిభద్రతలే కారణమని చెప్పారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పేది కూడా ఇదే. శాంతిభద్రతలు కల్పించడంలో మీరే కీలక పాత్ర పోషించాలి" అని సూచించారు. పోలీసులు ధరించే ఖాకీ చొక్కా సమాజానికి రక్షణ కవచం లాంటిదని, దాని గౌరవాన్ని కాపాడాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని పవన్ విమర్శించారు. క్రికెట్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వంటివి గ్రామ స్థాయికి చేరాయని, సైబర్ మోసాలు పెరిగిపోయి అమాయకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటిత నేరాల నియంత్రణపై కొత్త కానిస్టేబుళ్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల కొన్ని తీవ్రవాద జాడలు కూడా బయటపడుతున్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

2022లో నోటిఫికేషన్ ఇచ్చి, న్యాయపరమైన చిక్కులు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, దీనివల్ల అర్హత సాధించిన అభ్యర్థులు మూడేళ్ల విలువైన సమయాన్ని కోల్పోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, హోంమంత్రి వంగలపూడి అనిత పట్టుదలతో న్యాయపరమైన అడ్డంకులను తొలగించి, నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేశామని తెలిపారు. 

"మీరు ప్రజలకు అండగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది" అని భరోసా ఇచ్చారు. ఈసారి ఎంపికైన వారిలో 4051 మంది ఉన్నత విద్యావంతులు, 810 మంది సాంకేతిక కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారని, వారి నైపుణ్యాన్ని సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించాలని సూచించారు. ఎంపికైన 5,757 మందిలో 1,062 మంది మహిళలు ఉండటం సంతోషకరమని అన్నారు. ఈ నెల 22 నుంచి వీరికి 9 నెలల పాటు కఠిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Pawan Kalyan
AP Deputy CM
Chandrababu Naidu
Constable Jobs
Andhra Pradesh Police
Law and Order
Crime Control
Yogi Adityanath
Cyber Crime
Police Recruitment

More Telugu News