రామసేతుపై టీ20 ప్రపంచకప్ సందడి... ఘనంగా ప్రారంభమైన ట్రోఫీ టూర్

  • రామసేతు మీదుగా 2026 టీ20 ప్రపంచకప్ ట్రోఫీ టూర్ ప్రారంభం
  • భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న మెగా టోర్నీ
  • ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ప్రపంచకప్
  • ఆసియాలోని పలు దేశాల్లో ట్రోఫీ టూర్ 
  • భారత్‌లో 5, శ్రీలంకలో 3 వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ
2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన సందడి అధికారికంగా మొదలైంది. ఈ మెగా టోర్నీకి సంయుక్త ఆతిథ్యమిస్తున్న భారత్, శ్రీలంకలను సాంస్కృతికంగా కలిపే రామసేతు మీదుగా మంగళవారం ట్రోఫీ టూర్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య వారధిగా నిలిచే ఈ ప్రదేశంపై ట్రోఫీని ఆవిష్కరించడం ఈ కార్యక్రమానికే ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.

ఈ పదో ఎడిషన్ టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీ 29 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. భారత్‌లో ఐదు, శ్రీలంకలో మూడు కలిపి మొత్తం ఎనిమిది వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు కొలంబో, క్యాండీ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఈ ట్రోఫీ టూర్ భారత్, శ్రీలంకతో పాటు ఆసియాలోని ఖతార్, ఒమన్, నేపాల్, బహ్రెయిన్, మంగోలియా వంటి దేశాల్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది అభిమానులకు ట్రోఫీని దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలకు కూడా ట్రోఫీని తీసుకెళ్లనున్నారు.

ఈ కార్యక్రమం గురించి ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ.. "చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యమున్న రామసేతుపై ట్రోఫీ టూర్‌ను ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది కేవలం ట్రోఫీ ప్రయాణం కాదు, వివిధ సంస్కృతులను, క్రికెట్ సమాజాలను ఏకం చేసే ఒక యాత్ర" అని అన్నారు.

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా మాట్లాడుతూ... ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని, అభిమానులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తామని తెలిపారు.


More Telugu News