Nara Lokesh: 18 నెలలుగా ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది... ఆ రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh on AP Magic and Aviation EduCity
  • భోగాపురం వద్ద జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు
  • ప్రపంచ ఏవియేషన్ వర్క్ ఫోర్స్‌లో 25% తెలుగువారే ఉండాలన్నదే లక్ష్యం
  • విజన్ ఉన్న నేతలను విజన్ లేనివారు ఎగతాళి చేస్తారన్న లోకేష్
  • ఏపీ అభివృద్ధికి మిస్సైల్స్, జీపీఎస్‌గా పనిచేస్తున్నామని వ్యాఖ్య
  • ఉచితంగా 136 ఎకరాలు అందించిన మాన్సాస్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఒక చారిత్రక ఘట్టానికి అంకురార్పణ జరిగిందని, భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ రంగంలోని వర్క్ ఫోర్స్‌లో 25 శాతం తెలుగువారు ఉండాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో, మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మంత్రి లోకేశ్ సమక్షంలో జరిగింది. భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేయనున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "ఏపీలో 18 నెలలుగా ఏదో మ్యాజిక్ జరుగుతోందని, దాని రహస్యం ఏంటని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. వారికి నేను చెప్పిన సమాధానం ఒక్కటే. మా దగ్గర మిస్సైల్స్, జీపీఎస్ ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు వంటి అనుభవజ్ఞులైన పెద్దలు మాకు జీపీఎస్‌లా మార్గనిర్దేశం చేస్తుంటే, రామ్మోహన్ నాయుడు, అదితి గజపతిరాజు వంటి యువ నాయకులం మిస్సైల్స్‌లా దూసుకుపోతున్నాం. మేం చరిత్ర సృష్టిస్తున్నాం" అని అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు.

ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ జీఎంఆర్ అధినేత

జీఎంఆర్ సంస్థల అధినేతను 'ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ'గా అభివర్ణించిన లోకేశ్, ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పదో తరగతి ఫెయిల్ అయినా పట్టుదలతో ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. "శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు అవసరమా అని ఆనాడు కొందరు ఎగతాళి చేశారు. కానీ చంద్రబాబు గారి దూరదృష్టి వల్లే నేడు హైదరాబాద్‌కు రెండో విమానాశ్రయం అవసరం లేకుండా పోయింది. ఆ ఎయిర్‌పోర్ట్ తెలంగాణ జీడీపీలో 12 శాతం వాటాను అందిస్తోంది. విజన్ ఉన్న నాయకులను, విజన్ లేని వారు ఎప్పుడూ ఎగతాళి చేస్తారు" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

మాన్సాస్ ట్రస్ట్ గొప్ప మనసు

ఈ ప్రాజెక్టుకు మాన్సాస్ ట్రస్ట్ ఉచితంగా భూమిని అందించడాన్ని లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. "ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాన్సాస్ భూముల మ్యాప్‌తో ముందుకు వచ్చారు. ప్రపంచ స్థాయి సంస్థ వస్తే ఉచితంగా భూమి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రూపాయి అయినా తీసుకోవాలని నేను సూచించినా, వారు అంగీకరించలేదు. తమ రక్తంలోనే ఏవియేషన్ ఉందని, సంస్థకు మాన్సాస్ పేరు పెడితే చాలని గొప్ప మనసు చాటుకున్నారు. పూసపాటి వంశీయులు వేలాది ఎకరాలను ప్రజల కోసం దానం చేసిన గొప్ప చరిత్ర వారిది" అని అశోక్ గజపతిరాజు, అదితిలకు కృతజ్ఞతలు తెలిపారు.

క్లస్టర్ విధానంతో 20 లక్షల ఉద్యోగాలు

కూటమి ప్రభుత్వం 'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ' విధానంతో పనిచేస్తుందని లోకేశ్ పునరుద్ఘాటించారు. "చైనా తరహాలో క్లస్టర్ ఆధారిత అభివృద్ధి నమూనాను ఏపీలో అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా క్లస్టర్లను అభివృద్ధి చేసి, విద్యను పరిశ్రమలతో అనుసంధానిస్తాం. తద్వారా రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం" అని వివరించారు. 

99 పైసలకే భూములు ఇవ్వడం వల్లే విశాఖకు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు వచ్చాయని, రాబోయే 100 రోజుల్లో మరో రెండు పెద్ద ఐటీ కంపెనీలు రానున్నాయని తెలిపారు. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని కేవలం 12 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పి. అశోక్ గజపతిరాజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఛైర్మన్ జీబీఎస్ రాజు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
AP Development
Aviation EduCity
GMR Mansas
Andhra Pradesh
Chandrababu Naidu
Ashok Gajapathi Raju
Ram Mohan Naidu
Aditi Gajapathi Raju
Visakhapatnam

More Telugu News