Azharuddin: వక్ఫ్ భూముల పరిరక్షణే లక్ష్యం.. 'ఉమ్మీద్ పోర్టల్'పై మంత్రి అజారుద్దీన్ అప్ డేట్

Azharuddin Announces Ummeed Portal for Waqf Land Protection in Telangana
  • తెలంగాణలో వక్ఫ్ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్న అజారుద్దీన్
  • ఉమ్మీద్ పోర్టల్ ఏర్పాటులో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వెల్లడి
  • మైనార్టీల బడ్జెట్ పెంచేందుకు కృషి చేస్తామన్న మంత్రి
తెలంగాణలో వక్ఫ్ భూముల పరిరక్షణపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు. భూముల వివరాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా 'ఉమ్మీద్ పోర్టల్' ఏర్పాటు చేస్తున్నామని, అయితే గత 10 రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63,180 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 16,700 ఎకరాల వివరాలను మాత్రమే పోర్టల్‌లో నమోదు చేశారని మంత్రి వెల్లడించారు. ఇంకా 46 వేల ఎకరాలకు పైగా భూముల వివరాలు నమోదు కావాల్సి ఉందన్నారు. తప్పుడు పత్రాలతో భూములను అప్‌లోడ్ చేస్తే వాటిని తిరస్కరిస్తామని హెచ్చరించారు. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు, యాప్ సరిగా పనిచేయకపోవడం వల్ల భూముల నమోదుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వివరించారు.

ఇటీవల గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను మంత్రి దురదృష్టకరమని అభివర్ణించారు. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యార్థులకు భోజనం అందించడానికి 30 నిమిషాల ముందే అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. 

రాబోయే బడ్జెట్‌లో మైనార్టీల కోసం నిధులు పెంచేందుకు కృషి చేస్తున్నామని, గురుకులాల్లో కేవలం 40 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని అజారుద్దీన్ పేర్కొన్నారు.
Azharuddin
Telangana Waqf Board
Waqf properties protection
Ummeed Portal
Minority welfare Telangana
Waqf land digitization
Gurukulam food poisoning
Telangana news
Minority funds
Telangana government

More Telugu News