Cameron Green: ఐపీఎల్ వేలంలో కామెరాన్ గ్రీన్ సంచలనం.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డ్

Cameron Green Becomes Costliest Overseas Player
  • ఐపీఎల్ వేలంలో కామెరాన్ గ్రీన్‌కు రికార్డు ధర
  • రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
  • ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్
  • అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో డెవాన్ కాన్వే, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సంచలనం సృష్టించాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు, 2024) రికార్డును గ్రీన్ అధిగమించాడు.

గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరికి షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఒకవైపు విదేశీ ఆల్‌రౌండర్‌పై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తే, మరోవైపు ప్రతిభావంతులైన యువ భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.

యువ ఓపెనర్ పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోలేదు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ వరుసగా రెండో వేలంలోనూ పృథ్వీ షాకు చుక్కెదురైంది.

అలాగే విధ్వంసకర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా అమ్ముడుపోలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 73 పరుగులు చేసినా, అతడిని ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. న్యూజిలాండ్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
Cameron Green
IPL 2026
Kolkata Knight Riders
KKR
IPL Auction
Mitchell Starc
Prithvi Shaw
Sarfaraz Khan
Devon Conway
Cricket

More Telugu News