Kishan Reddy: లీక్ వీరులకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. మోదీ మీటింగ్‌పై కీలక వ్యాఖ్యలు

Kishan Reddy Warns on Leaks Regarding Modi Meeting
  • తెలంగాణ బీజేపీలో కలకలం రేపిన లీకుల వ్యవహారం
  • ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నారంటూ ప్రచారం
  • లీకుల వార్తలను తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి
  • లీక్ వీరులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
తెలంగాణ బీజేపీలో లీకుల వ్యవహారంపై కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలు మీడియాకు లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఎంపీలకు క్లాస్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

గత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర పార్టీ పనితీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఒవైసీ పార్టీ కన్నా వెనుకబడ్డారని ప్రధాని అన్నట్లు వార్తలు రావడం పార్టీలో కలకలం రేపింది.

ఈ ప్రచారంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. అవన్నీ నిరాధారమైన కథనాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎలాంటి క్లాస్ తీసుకోలేదని, కేవలం పార్టీ బలోపేతానికి, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటానికి కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. అంతర్గత సమావేశంలోని విషయాలను బయటకు లీక్ చేయడం కచ్చితంగా తప్పేనని అన్నారు. ఈ లీక్‌ల వెనుక ఉన్న 'లీకు వీరులు' ఎవరో తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనతో తెలంగాణ కమలంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయని, ఆ లీడర్లు ఎవరనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Kishan Reddy
Telangana BJP
Narendra Modi
BJP meeting
Telangana MPs
Party Leaks
Internal conflicts
BJP Telangana
Kishan Reddy warning
Telangana politics

More Telugu News