విదేశాల నుంచి రాగానే జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసుల నోటీసులు

  • సీఎం, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో జగన్ బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులు
  • విదేశాల నుంచి తిరిగి రాగానే ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న అధికారులు
  • గతంలోనే కేసు నమోదు కాగా విదేశాలకు వెళ్లిన అర్జున్ రెడ్డి
  • ఆయనపై లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైన అర్జున్ రెడ్డికి గుడివాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై 2025 నవంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగానే తాజా పరిణామం చోటుచేసుకుంది.
 
గతంలో కేసు నమోదైన సమయంలో అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన విదేశాలకు పరారయ్యారు. దీంతో అధికారులు ఆయనపై లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అర్జున్ రెడ్డి విదేశాల నుంచి భారత్‌కు తిరిగి రాగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం మేరకు రంగంలోకి దిగిన గుడివాడ పోలీసులు, అర్జున్ రెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేశారు.
 
అయితే, అప్పటికే అర్జున్ రెడ్డి తన న్యాయవాదులను ఎయిర్‌పోర్టుకు పిలిపించుకున్నారు. గుడివాడలోనే కాకుండా ఉమ్మడి కడపతో సహా మరికొన్ని జిల్లాల్లో కూడా ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది.


More Telugu News