Supriya Sule: ఈవీఎంలపై సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు

Supriya Sule Backs EVMs After 4 Times as MP
  • ప్రతిపక్షాల విమర్శల వేళ ఈవీఎంలకు సూలె మద్దతు
  • ఇదే మెషీన్ పై తాను నాలుగుసార్లు గెలిచానన్న ఎన్సీపీ నేత
  • మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఈవీఎంలను అనుమానించలేనని వ్యాఖ్య
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో ఎన్నికల సంఘం కుమ్మక్కైందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ను హ్యాక్ చేసి ఎన్నికల్లో గెలుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతలంతా బీజేపీ, ఈవీఎంలపై విమర్శలు గుప్పిస్తున్న వేళ ఇండియా కూటమిలోని ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలకు విరుద్ధంగా ఈవీఎంలకు ఆమె మద్దతు తెలిపారు. మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి తాను నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యానని, ఆ నాలుగు సందర్భాల్లోనూ ఈవీఎంలలోనే ఓటింగ్ జరిగిందని గుర్తుచేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలను ఎంపీ సుప్రియా సూలె తోసిపుచ్చారు. బీజేపీ విజయానికి తాను ఈవీఎంలను తప్పుబట్టలేనని స్పష్టం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లను నియమించే ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

ఎన్నికలు పూర్తయిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేయడానికి అనుమతించే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ఒక నెల ముందు అన్ని పార్టీలకు మెషిన్ రీడబుల్ ఓటరు జాబితాను అందించాలని ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తుండగా.. అదే సమయంలో దాని మిత్రపక్షం ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ ఈవీఎంలకు మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Supriya Sule
EVM
Electronic Voting Machine
India Alliance
Maharashtra
Baramati
NCP SP
Indian Elections
Election Commission
EVM Hacking

More Telugu News