Doctors Prescription: వైద్యులు మందుల చీటీలపై రాసే రాత అర్థం కావడం లేదా?.. ఇకపై ఆ ఇబ్బంది లేదు..!

National Medical Commission on Doctors Prescription Readability
  • వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై జాతీయ వైద్య కమిషన్ కీలక ఆదేశాలు
  • చేతిరాత స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలని సూచన
  • పర్యవేక్షణకు ప్రత్యేక సబ్-కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు
  • జనరిక్ పేర్లతోనే మందులు రాయడం తప్పనిసరి
వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లు (మందుల చీటీలు) స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య హక్కులో అంతర్భాగమని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎన్ఎంసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి మెడికల్ కాలేజీలోని డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) కింద ఒక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. వైద్యులు మందులు రాసే పద్ధతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తుంది. వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది.

ఈ కమిటీ నివేదికలను డీటీసీ సమావేశ మినిట్స్‌లో నమోదు చేయాలని, అవసరమైనప్పుడు ఆ నివేదికలను తమకు సమర్పించాలని ఎన్ఎంసీ పేర్కొంది. మందుల చీటీలో చేతిరాత స్పష్టంగా ఉండటంతో పాటు వీలైతే క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలని తెలిపింది. అలాగే మందులను వాటి జనరిక్ పేర్లతోనే రాయడం, అనవసరమైన మందులు సూచించకుండా హేతుబద్ధత పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ పర్యవేక్షణ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేసి, అమలు చేయాలని అన్ని వైద్య కళాశాలలను ఆదేశించింది.
Doctors Prescription
National Medical Commission
NMC
Medical Prescription
Illegible handwriting
Drugs and Therapeutics Committee
DTC
Medical colleges
Punjab and Haryana High Court

More Telugu News