పోలీస్ కొలువుల భర్తీ పూర్తి.. నేడు కొత్త కానిస్టేబుళ్లతో సీఎం చంద్రబాబు భేటీ

  • పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీని పూర్తి చేసిన ప్రభుత్వం
  • మొత్తం 6,014 మంది అభ్యర్థుల ఎంపిక
  • నేడు మంగళగిరిలో కొత్త కానిస్టేబుళ్లతో సీఎం చంద్రబాబు భేటీ
  • ఈ నెల 22 నుంచి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు.

మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. పోలీసు శాఖలో అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలికి, అభినందనలు తెలిపేందుకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరవుతున్నారు. ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.

గత ప్రభుత్వం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలను ఆలస్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశంపై దృష్టి సారించిందని అధికార వర్గాలు తెలిపాయి. రిక్రూట్‌మెంట్‌పై ఉన్న 31 రిట్ పిటిషన్లను న్యాయస్థానాల్లో పరిష్కరించి, కేవలం 60 రోజుల్లోనే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పటికే జిల్లాల్లో నియామక పత్రాలు అందుకున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 6,014 మంది సెలక్ట్ అవ్వ‌గా.. వీరిలో 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారు.  వీరిలో  సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. వీరిలో 993 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇటీవలే మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు శాఖలోనూ నియామకాలు పూర్తి చేయడం గమనార్హం.


More Telugu News