Ganesh Chavan: కోటి రూపాయల బీమా కోసం హత్య.. ప్రియురాలికి మెసేజ్‌లు పంపి దొరికిపోయాడు!

Maharashtra Ganesh Chavan Arrested for Murdering Man for Insurance
  • తాను చనిపోయినట్టు నమ్మించేందుకు నాటకం
  • అమాయకుడైన హిచ్‌హైకర్‌ను కారులో సజీవ దహనం చేసిన వైనం
  • ప్రియురాలికి మెసేజ్‌లు పంపడంతో గుట్టురట్టు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు
తాను చనిపోయినట్టు నమ్మించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కాజేయాలనుకున్నాడో వ్యక్తి. ఇందుకోసం ఓ అమాయకుడిని దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు సహా అందరూ అతడు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో.. ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను తలకిందులు చేశాయి. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

లాతూర్ జిల్లా ఔసా తాలూకాలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన కారులో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. విచారణలో ఆ కారు గణేశ్ చవాన్ అనే బ్యాంక్ రికవరీ ఏజెంట్‌కు చెందినదని తేలింది. అతడి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కారులో చనిపోయింది అతనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అయితే, దర్యాప్తు కొనసాగిస్తుండగా పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. చవాన్ వ్యక్తిగత జీవితంపై ఆరా తీయగా, అతడికి ఓ మహిళతో సంబంధం ఉందని తెలిసింది. ఆమెను విచారించగా, అసలు విషయం బయటపడింది. చనిపోయాడనుకుంటున్న గణేశ్ చవాన్ తనకు మరో ఫోన్ నంబర్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, కొత్త నంబర్‌ను ట్రాక్ చేసి సింధుదుర్గ్ జిల్లాలోని విజయదుర్గ్‌లో చవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో చవాన్ తన నేరాన్ని అంగీకరించాడు. తనకు ఉన్న ఇంటి లోన్ తీర్చేందుకు రూ. కోటి జీవిత బీమా డబ్బులు పొందాలని ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి, మద్యం మత్తులో ఉన్న అతడిని కారు డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహం తనదేనని నమ్మించేందుకు తన బ్రాస్‌లెట్‌ను కూడా అక్కడే వదిలేశాడు. ప్రస్తుతం చవాన్‌పై హత్య కేసు నమోదు చేసి, ఈ నేరంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని లాతూర్ ఎస్పీ అమోల్ తాంబే తెలిపారు.
Ganesh Chavan
insurance fraud
murder for insurance
Maharashtra crime
Govind Yadav
Latur
Ausa
crime news
life insurance
bank recovery agent

More Telugu News