యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి ప్రాణాలు తీసిన పొగమంచు

  • యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం
  • దట్టమైన పొగమంచు కారణంగా ఢీకొన్న బస్సులు, కార్లు
  • మరో 25 మందికి పైగా గాయాలు
  • ఢీకొన్న వెంటనే వాహనాలకు అంటుకున్న మంటలు
ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆరు బస్సులు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం మథుర జిల్లా పరిధిలోని ఆగ్రా-నోయిడా మార్గంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ఒకదాని వెనుక ఒకటి వేగంగా ఢీకొన్నాయి. ఢీకొన్న తీవ్రతకు వాహనాల్లో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టి, వాహనాల శకలాలను తొలగించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


More Telugu News