మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురి మృతి!

  • కుప్పకూలిన ప్రైవేట్ విమానం
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఘటన
  • ప్రమాద స్థలం నుంచి 130 మంది తరలింపు
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రిన్ హెర్నాండెజ్ అధికారికంగా ధ్రువీకరించారు.

మెక్సికో సిటీకి పశ్చిమాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టొలుకా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే పారిశ్రామిక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయల్దేరిన ఈ విమానంలో ఇద్దరు సిబ్బంది, ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన చాలా గంటల తర్వాత కూడా ఏడు మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

సమీపంలోని సాకర్ మైదానంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, అదుపుతప్పిన విమానం ఓ వాణిజ్య భవనం పైకప్పును బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ముందుజాగ్రత్త చర్యగా ప్రమాద స్థలం నుంచి సుమారు 130 మందిని ఖాళీ చేయించినట్లు శాన్ మాటియో అటెంకో మేయర్ అనా మునిజ్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News