Nara Brahmani: చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి

Nara Brahmani Clarifies She Wont Enter Politics Even if Chandrababu Asks
  • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న నారా బ్రాహ్మణి
  • హెరిటేజ్ ఫుడ్స్ సంస్థే తన తొలి ప్రాధాన్యమని వెల్లడి
  • లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశం వదులుకోలేనన్న లోకేశ్ భార్య
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు.

బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (MPW) 2025' కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు?" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదు" అని స్పష్టంగా సమాధానమిచ్చారు.

"పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి?" అని ఆమె ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని బ్రాహ్మణి వివరించారు. ఈ వ్యాఖ్యలతో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు.
Nara Brahmani
Heritage Foods
Nara Lokesh
Chandrababu Naidu
Politics
Business Today MPW 2025
Women Empowerment
Dairy Industry
Andhra Pradesh

More Telugu News