భారత కరెన్సీపై నిషేధం ఎత్తివేసిన నేపాల్

  • రూ. 500, రూ. 200 నోట్ల వినియోగానికి అనుమతి
  • భారత్-నేపాల్ మధ్య ప్రయాణించే వారికి భారీ ఊరట
  • రూ.25,000 పరిమితి వరకు నోట్లు తీసుకెళ్లే అవకాశం
భారత్-నేపాల్ మధ్య ప్రయాణించే వారికి నేపాల్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత కరెన్సీకి చెందిన రూ.200, రూ.500 నోట్లను తమ దేశంలోకి తీసుకురావడానికి, తీసుకెళ్లడానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపాల్, భారత పౌరులిద్దరికీ వర్తిస్తుంది.

కేబినెట్ సమావేశం అనంతరం ప్రభుత్వ అధికార ప్రతినిధి, సమాచార శాఖ మంత్రి జగదీశ్ ఖరేల్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నవంబర్ 28న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, ఇరు దేశాల పౌరులు రూ.25 వేల పరిమితి వరకు ఈ నోట్లను తమ వెంట ఉంచుకోవచ్చు.

ఈ నిర్ణయం వల్ల వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే నేపాల్ పౌరులకు, అలాగే నేపాల్‌ను సందర్శించే భారత పర్యాటకులకు, యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు రూ.100 కంటే ఎక్కువ విలువైన భారత నోట్లను కలిగి ఉండటం నేపాల్‌లో చట్టవిరుద్ధం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

2016 నవంబర్‌లో భారత్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత నేపాల్ కూడా ఆ నోట్ల వినియోగాన్ని నిషేధించింది. ఆ సమయంలో మార్పిడి కాని సుమారు రూ.5 కోట్ల విలువైన పాత నోట్లు ఇప్పటికీ నేపాల్ బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఉన్నాయని అక్కడి సెంట్రల్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో సరిహద్దు ప్రాంతాల ప్రజల దైనందిన కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. 


More Telugu News