Potti Sreeramulu: 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' గా అమరావతిలో అమరజీవి స్మృతివనం: సీఎం చంద్రబాబు ప్రకటన

Potti Sreeramulu Statue of Sacrifice to be Built in Amaravati Says CM Chandrababu
  • అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు
  • ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం
  • 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం చేస్తున్నట్లు సీఎం వెల్లడి
  • మూడు రాజధానుల పేరుతో గత పాలకులు కుట్ర చేశారని విమర్శ
  • అభివృద్ధి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో 'స్మృతి వనం' నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని 'స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్' పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగఫలమే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమని గుర్తుచేశారు. "పొట్టి శ్రీరాములు మరణం తర్వాత తెలుగు ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమ తీవ్రతను గమనించిన నాటి ప్రధాని నెహ్రూ, 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది" అని చంద్రబాబు వివరించారు.

కొన్ని చారిత్రక తేదీలపై అనవసర రాజకీయాలు చేస్తున్నందునే, పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని 'డే ఆఫ్ శాక్రిఫైస్'గా నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వనం, మ్యూజియం నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది ఇదే రోజున 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. 2026 మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. అమరజీవి స్ఫూర్తితో తెలుగు జాతిని అగ్రపథాన నిలిపేలా సుపరిపాలన అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Potti Sreeramulu
Andhra Pradesh
Amaravati
Statue of Sacrifice
Chandrababu Naidu
Telugu State
Smruti Vanam
Day of Sacrifice
History of Andhra Pradesh
Telugu Pride

More Telugu News