Shashi Tharoor: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై శశి థరూర్ ఏమన్నారంటే...!

Shashi Tharoor responds to MGNREGA name change proposal
  • ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రాజకీయ వివాదం
  • ఇది గాంధీ వారసత్వాన్ని దెబ్బతీయడమేనన్న శశి థరూర్
  • MGNREGA స్థానంలో 'గ్రామ్-జి' బిల్లును తేనున్న కేంద్రం
  • పనిదినాలను 100 నుంచి 125కి పెంచే ప్రతిపాదన
  • ఇది అనవసరమైన, ఖర్చుతో కూడిన చర్య అని కాంగ్రెస్ విమర్శ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అమలవుతున్న ఈ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ చర్యను దురదృష్టకరమని అభివర్ణించారు.

కొంతకాలంగా మోదీ సర్కారు నిర్ణయాలకు మద్దతుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత శశి థరూర్... ఈ విషయంలో మాత్రం కేంద్రాన్ని తప్పుబడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ విషయంపై సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. "గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం అనేవి గాంధీజీ చైతన్యంలో రెండు మూలస్తంభాలు. వాటి మధ్య ఎప్పుడూ వైరుధ్యం లేదు. గ్రామీణ పేదల కోసం ఉద్దేశించిన పథకానికి మహాత్ముడి పేరును తొలగించడం ద్వారా ఆయన వారసత్వాన్ని అగౌరవపరచొద్దు. ఆయన చివరి మాట 'రామ్'. లేని వివాదాన్ని సృష్టించి ఆయన స్ఫూర్తిని దెబ్బతీయవద్దు" అని థరూర్ పేర్కొన్నారు.

MGNREGA స్థానంలో 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025'ను లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. దీన్నే సంక్షిప్తంగా 'గ్రామ్-జి' (G-RAM-G) బిల్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు హామీ ఇచ్చే పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచనున్నారు. మోసాలను అరికట్టేందుకు ఏఐ ఆధారిత వ్యవస్థలను, పారదర్శకత కోసం ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి రెండుసార్లు సామాజిక తనిఖీలను తప్పనిసరి చేయనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. "పేరు మార్పు వల్ల కార్యాలయాల నుంచి స్టేషనరీ వరకు అన్నీ మార్చాల్సి ఉంటుంది. ఇది అనవసరమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దీనివల్ల ప్రయోజనం ఏమిటి?" అని ఆమె ప్రశ్నించారు. 

అయితే, ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి కల్పనతో పాటు రైతులకు కూడా మేలు జరుగుతుందని, వ్యవసాయ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వివరిస్తున్నారు.

తీవ్రంగా మండిపడిన అశోక్ గెహ్లాట్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) పేరును మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఇది బీజేపీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని, జాతిపిత మహాత్మా గాంధీని ఘోరంగా అవమానించడమేనని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 

తొలుత ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించాలని చూసిన ఎన్డీఏ ప్రభుత్వం, విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిందని.. ఇప్పుడు 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్' (VB G RAM G) అనే కొత్త పేరును తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ పేరు మార్పు కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం కాదని, దేశవ్యాప్తంగా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఒక చారిత్రక పథకం నుంచి గాంధీ వారసత్వాన్ని ఉద్దేశపూర్వకంగా చెరిపేసే కుట్ర అని గెహ్లాట్ విమర్శించారు. 

యావత్ ప్రపంచం గాంధీకి తలవంచి నమస్కరిస్తోందని, ఇటీవల జీ-20 సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సహా అనేకమంది ప్రపంచ నేతలు రాజ్‌ఘాట్‌లో గాంధీకి నివాళులర్పించారని గుర్తుచేశారు. గాంధీ జీవితాంతం రాముడి భక్తుడని, ఆయన చివరి మాటలు కూడా 'హే రామ్' అని పేర్కొంటూ.. అలాంటి గాంధీ పేరును తొలగించడానికి రాముడి పేరును వాడుకోవడం అత్యంత అభ్యంతరకరమని అన్నారు. గాంధీ సిద్ధాంతాలపై బీజేపీకి నమ్మకం లేదనడానికి ఈ చర్యే నిదర్శనమని, ఈ ప్రతిపాదనను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Shashi Tharoor
MGNREGA
employment guarantee scheme
Priyanka Gandhi Vadra
Ashok Gehlot
rural employment
NREGA name change
Vikshit Bharat
G-RAM-G Bill
Indian politics

More Telugu News