Suryakumar Yadav: సూర్యకుమార్ ఆ పికప్ షాట్‌ను పక్కన పెట్టెస్తే మంచిది: గవాస్కర్ కీలక సూచన

Suryakumar Yadav Should Avoid Pick Up Shot Gavaskar Key Suggestion
  • సూర్యకుమార్ షాట్ సెలక్షన్‌పై స్పందించిన సునీల్ గవాస్కర్
  • ఫామ్‌లో లేకపోవడంతో పికప్ షాట్ మిస్సవుతోందన్న గవాస్కర్
  • సూర్యకుమార్ కొన్ని రోజులు పికప్ షాట్‌ను పక్కన పెట్టాలన్న గవాస్కర్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షాట్ సెలక్షన్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. ఇటీవల ఫామ్ కోసం సూర్యకుమార్ తంటాలు పడుతున్నాడు. ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో కూడా స్వల్ప పరుగులకే వెనుదిరిగాడు. మరో రెండు నెలల్లో ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మేనేజ్‌మెంట్‌, అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్‌కు సునీల్ గవాస్కర్ సూచనలు చేశాడు.

సాధారణంగా సూర్యకుమార్ తన అమ్ములపొదిలోని పికప్ షాట్‌ను చక్కగా ఆడుతాడని అన్నాడు. ఇప్పుడు ఫామ్‌లో లేకపోవడంతో పికప్ షాట్ మిస్సవుతోందని తెలిపాడు. స్టాండ్స్‌లో పడాల్సిన బంతి బౌండరీ లైన్‌ లోపలే గాల్లోకి లేస్తోందని పేర్కొన్నాడు.

మంచి ఆరంభం లభించేదాకా సూర్యకుమార్ కొన్ని రోజులు ఆ పికప్ షాట్‌ను పక్కన పెట్టేస్తే మంచిదని గవాస్కర్ సూచించాడు. ఆ షాట్ కారణంగానే అతను ఔట్ అవుతున్నాడని గుర్తుంచుకోవాలని అన్నాడు. సూర్యకుమార్ లాంటి ఆటగాడు 12 పరుగులకే ఔటవ్వాలని అభిమానులు, టీమిండియా కోరుకోవడం లేదని తెలిపాడు.

టీ20ల్లో స్కూప్, పికప్ షాట్లకు సూర్యకుమార్ యాదవ్ పెట్టింది పేరు. ఇప్పుడు అవే షాట్లకు ఔటవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సూర్య ఇలాగే వెనుదిరిగాడు. ధర్మశాలలోనూ పికప్ షాట్ టైమింగ్ కుదరక వికెట్ పారేసుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు ఆ షాట్‌ను పక్కన పెట్టేయాలని గవాస్కర్ సూచించాడు.
Suryakumar Yadav
Suryakumar Yadav batting
Sunil Gavaskar
India vs South Africa

More Telugu News