Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ... వివరాలు ఇవిగో!

Nara Lokesh Meets Union Education Minister Dharmendra Pradhan
  • ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ
  • రాష్ట్రంలో చేపడుతున్న విద్యా సంస్కరణలను కేంద్ర మంత్రికి వివరణ
  • 11 నవోదయ విద్యాలయాలు, రూ.4,400 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
  • 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఏపీ ప్రభుత్వ చర్యలను అభినందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను లోకేశ్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో పఠన, గణన నైపుణ్యాలు పెంచేందుకు 'గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్' కార్యక్రమం, అభ్యసన సామర్థ్యాల కోసం క్లిక్కర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్‌రూమ్‌లు ప్రవేశపెట్టామని తెలిపారు. విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు 'ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ' పేరుతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నామని, బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా కడపలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్మార్ట్ కిచెన్ గురించి కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.

అనంతరం, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై మంత్రి లోకేశ్ పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి ప్రతిపాదించిన 11 జవహర్ నవోదయ విద్యాలయాలను (JNV) వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే, ఇప్పటికే కేటాయించిన 12 కేంద్రీయ విద్యాలయాల (KV) ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. 

సమగ్ర శిక్ష సంస్కరణల్లో భాగంగా స్టార్స్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి రూ.4,400 కోట్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.1,270 కోట్ల అదనపు నిధులకు ఆమోదం తెలపాలని, పీఎం పోషణ్ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.

ఈ సందర్భంగా, గుంటూరు జిల్లా చినకాకానిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసిన మోడల్ ఆటిజం సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించాలని లోకేశ్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆహ్వానించారు. 
Nara Lokesh
Andhra Pradesh education
Dharmendra Pradhan
Jawahar Navodaya Vidyalayas
Kendriya Vidyalayas
STARS project
PM Poshan scheme
Smart Kitchens
AP School Legislative Assembly

More Telugu News