Kesineni Srinath: లోక్‌సభలో వైసీపీపై విమర్శల వర్షం కురిపించిన కేశినేని చిన్ని

Kesineni Chinni Criticizes YSRCP in Lok Sabha Over Medical Colleges
  • 17 మెడికల్ కాలేజీల హామీని నిలబెట్టుకోలేదని విమర్శ
  • రూ.500 కోట్లతో రాజభవనం కట్టారని, ఆ డబ్బుతో కాలేజీలు కట్టొచ్చని వ్యాఖ్య
  • పీపీపీకి, ప్రైవేటీకరణకు తేడా తెలియదా? అని మండిపాటు
లోక్‌సభలో అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలను, విద్యార్థులను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు.

నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి, ఒక్కటి కూడా ప్రారంభించలేదని శివనాథ్ ఎండగట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వైద్య రంగం పూర్తిగా పతనమైందని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో కాలేజీలు నిర్మిస్తుంటే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. పీపీపీ మోడల్‌లో 100 శాతం ప్రభుత్వ నియంత్రణ, 50 శాతం ప్రభుత్వ కోటా సీట్లు ఉంటాయని, వైసీపీ నేతలకు పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా కూడా తెలియకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

వైసీపీ నాయకుడి కోసం రూ.500 కోట్లతో రాజభవనం నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని శివనాథ్ ఆరోపించారు. ఆ డబ్బుతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక అంశాలను కూడా ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణ భారతదేశంలో మెట్రో రైలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని గుర్తుచేశారు. విజయవాడ, విశాఖ నగరాలకు మెట్రో ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధికి అత్యవసరమని, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు ఇవి దోహదపడతాయని తెలిపారు. యూరియా సబ్సిడీ కోసం కేంద్రం రూ.31,000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ, ఏపీలో యూరియా సంక్షోభాన్ని పరిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దేశం 8.2 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించిందని కేశినేని శివనాథ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Kesineni Srinath
Kesineni Chinni
YSRCP
Andhra Pradesh
Medical Colleges
PPP Model
Chandra Babu Naidu
Metro Rail
Vijayawada
Visakhapatnam

More Telugu News