Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో!

Shaheen Afridi Humiliated in Big Bash League Debut
  • బిగ్‌బాష్ లీగ్ అరంగేట్రంలో షహీన్ అఫ్రిదికి షాక్
  • రెండు డేంజరస్ ఫుల్ టాస్‌లు వేయడంతో బౌలింగ్ నుంచి తొలగింపు
  • కేవలం 2.4 ఓవర్లలోనే 43 పరుగులు సమర్పించుకున్న పాక్ పేసర్
  • టిమ్ సీఫర్ట్ సెంచరీతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ భారీ స్కోరు
పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదికి బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అరంగేట్రంలో తీవ్రమైన అవమానం ఎదురైంది. ప్రమాదకరమైన బౌలింగ్ కారణంగా అంపైర్లు అతడిని మ్యాచ్ మధ్యలోనే బౌలింగ్ నుంచి తప్పించారు. మంగళవారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన బ్రిస్బేన్ హీట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన అఫ్రిది.. టిమ్ సీఫర్ట్, ఆలీ పీక్‌లకు వరుసగా రెండు నడుము ఎత్తులో ఫుల్ టాస్ బంతులు విసిరాడు. వీటిని ప్రమాదకరమైనవిగా పరిగణించిన ఫీల్డ్ అంపైర్లు, నిబంధనల ప్రకారం అతడిని ఆ ఓవర్ పూర్తి చేయకుండా నిలిపివేశారు. దీంతో కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ మిగిలిన రెండు బంతులను వేసి ఓవర్‌ను పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో అఫ్రిది నవ్వుతూ మైదానం వీడాడు.

ఈ మ్యాచ్‌లో షహీన్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 2.4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 43 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ రేటు 16.10గా నమోదైంది. అంతకుముందు పవర్ సర్జ్‌లో వేసిన 13వ ఓవర్‌లో కూడా 19 పరుగులు ఇచ్చాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అఫ్రిది, తన తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమయ్యాడు.

అఫ్రిది పేలవ బౌలింగ్‌ పుణ్యమా అని, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. టిమ్ సీఫర్ట్ (56 బంతుల్లో 102) అద్భుత శతకం చేయగా, ఆలీ పీక్ (29 బంతుల్లో 57) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన మరో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ 10 బంతుల్లో 4 పరుగులకే ఔటయ్యాడు.
Shaheen Afridi
Shaheen Shah Afridi
BBL
Big Bash League
Brisbane Heat
Melbourne Renegades
Tim Seifert
Ali Orr
Pakistan bowler
no ball

More Telugu News