Omar Abdullah: ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. మాకు సంబంధం లేదన్న ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah says vote theft comments by Rahul Gandhi not INDIA alliance issue
  • ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ విమర్శలు
  • ప్రతి పార్టీకి సొంత అజెండాను నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉందన్న ఒమర్ అబ్దుల్లా
  • ఏం చేయాలనే విషయమై వారి పార్టీకి తాము చెప్పలేమన్న ఒమర్
ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షాకిచ్చారు. ఈ అంశంలో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 'ఇండియా' కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓట్ల చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోందని, కానీ దీనితో ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పార్టీకి తన సొంత అజెండాను నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉందని, ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లను కాంగ్రెస్ పార్టీ తన ప్రధానాంశాలుగా మార్చుకుందని గుర్తు చేశారు. ఏం చేయాలనే విషయమై వారి పార్టీకి తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఢిల్లీలో 'ఓట్ చోర్.. గద్దీ ఛోడ్' పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. సభ జరిగిన మరుసటి రోజునే ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

'ఇండియా' కూటమి పరిస్థితిపై ఆయన్ ఇటీవల కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇండియా' కూటమి పరిస్థితి వెంటిలెటర్‌పై ఉన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల విషయంలో విపక్ష కూటమి పట్టింపు లేనట్లుగా వ్యవహరించిందని ఆరోపించారు.
Omar Abdullah
Jammu Kashmir
Rahul Gandhi
Indian National Congress
INDIA alliance

More Telugu News