Manoj Bajpayee: బాలీవుడ్ పరిశ్రమపై నటుడు మనోజ్ బాజ్‌పేయీ సంచలన వ్యాఖ్యలు

Manoj Bajpayees Sensational Comments on Bollywood Industry
  • బాలీవుడ్‌లో అభద్రతాభావం బాగా పెరిగిపోయిందన్న మనోజ్
  • ఒకరినొకరు మెచ్చుకునే సంస్కృతి తగ్గిపోయిందని ఆవేదన
  • ఒక హిట్ వస్తే సరిపోదని వ్యాఖ్య
విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయీ బాలీవుడ్ సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పరిశ్రమలో అభద్రతాభావం బాగా పెరిగిపోయిందని, ఒకరినొకరు ప్రశంసించుకునే వాతావరణం కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే చిత్రంలో నటిస్తున్న ఆయన, ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మనోజ్ బాజ్‌పేయీ మాట్లాడుతూ, “బాలీవుడ్‌లో ఒకరి పనిని మరొకరు మెచ్చుకునే సంస్కృతి తగ్గిపోయింది. కనీసం ఫోన్ చేసి అయినా బాగుందని చెప్పరు. ఇక్కడ అందరిలోనూ అభద్రత పెరిగిపోయింది” అని పేర్కొన్నారు. తాను మాత్రం మంచి పాత్రల కోసం అందరికీ ఫోన్లు చేస్తూనే ఉంటానని, తన సినిమాల గురించి ప్రేక్షకుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని స్పష్టం చేశారు.

సినీ రంగంలో ఓ నటుడు తన స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని ఆయన అన్నారు. "ఒక సినిమా విజయం సాధించినంత మాత్రాన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. తదుపరి అవకాశం వస్తుందో? రాదో? అనే ఆందోళన నిరంతరం ఉంటుంది. విజయం ఉంటేనే అవకాశాలు, లేదంటే నటుడు తన ఉనికిని కోల్పోతాడు" అని వివరించారు. 

హిందీ, తెలుగు సహా పలు భాషల్లో గుర్తింపు పొందిన మనోజ్, ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’, ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించారు. 
Manoj Bajpayee
Bollywood
Hindi film industry
insecurity
Ram Gopal Varma
Police Station Me Bhoot
Family Man Season 3
Inspector Jhende
Indian cinema
film industry

More Telugu News