JC Prabhakar Reddy: తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి.. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి సవాల్

JC Prabhakar Reddy Challenges Pedda Reddy in Tadipatri Land Dispute
  • కేతిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
  • అక్రమ నిర్మాణాలు నిరూపిస్తే కూల్చేందుకు సిద్ధమని ప్రకటన
  • రేపు పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతిపత్రం ఇస్తామన్న జేసీ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. భూకబ్జా ఆరోపణలపై పెద్దారెడ్డి చేసిన ఫిర్యాదుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే వచ్చి అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నాయో నిరూపించాలని పెద్దారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.

ఎర్ర కాలువ, రహదారి నిర్మాణంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. "ఎర్ర కాలువ, రోడ్డు కోసం స్థల యజమానులతో మాట్లాడి ఏడు మీటర్ల స్థలాన్ని పంచాయతీరాజ్‌కు అప్పగించాం. నిధులు లేకపోవడంతో ఆ పనిని ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేశారు. వారు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చారు. ఆ ప్రాంతంలోని భూమి మొత్తం ప్రైవేటు వ్యక్తులదే. వారే 20 మీటర్ల స్థలాన్ని రోడ్డు కోసం వదిలి ప్లాట్లు వేసుకున్నారు" అని జేసీ వివరించారు.

అయితే, ఇందులో అక్రమ ప్లాట్లు ఎక్కడున్నాయో పెద్దారెడ్డి వచ్చి నిరూపించాలని జేసీ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను నిరూపించాలంటూ తమ కౌన్సిలర్లు రేపు ఉదయం పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తారని తెలిపారు. "పెద్దారెడ్డి వచ్చి ఏ నిర్మాణం అక్రమమని చూపిస్తే, దానిని కూల్చివేయడానికి నేను సిద్ధం" అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. 
JC Prabhakar Reddy
Tadipatri
Kethi Reddy Pedda Reddy
Anantapur
Andhra Pradesh Politics
Land Grabbing Allegations
Municipal Chairman
Political Challenge
YSRCP
Real Estate Disputes

More Telugu News