Mutyala Indra Karan Reddy: అమెరికా మామ గారి ఓటు చలవ... ఒక్క ఓటుతో గెలిచిన కోడలు

NRI Vote Decisive Mutyala Sri Veda Wins Telangana Local Election by One Vote
  • నిర్మల్ జిల్లాలో ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచిన కోడలు
  • కోడలి కోసం అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ
  • భాగపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం
  • 189 ఓట్లు సాధించిన శ్రీవేద, 188 ఓట్లతో ప్రత్యర్థి ఓటమి
ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కోడలు ఎన్నికల్లో నిలబడటంతో, ఆమెను గెలిపించడం కోసం అమెరికా నుంచి వచ్చిన మామ గారు వేసిన ఓటు ఆమె విజయంలో కీలకంగా మారింది. కేవలం ఒక్క ఓటు తేడాతో కోడలు సర్పంచ్‌గా విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద పోటీ చేశారు. ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికాలో ఉంటున్నారు. తన కోడలు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆమెకు మద్దతుగా నిలిచేందుకు ఆయన పోలింగ్‌కు నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల రోజున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఫలితం ఉత్కంఠభరితంగా మారింది. గ్రామంలో మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపులో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లనిదిగా అధికారులు ప్రకటించారు. దీంతో కేవలం ఒక్క ఓటు తేడాతో శ్రీవేద విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి మరీ వేసిన ఆ ఒక్క ఓటే తన కోడలి గెలుపును నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Mutyala Indra Karan Reddy
Nirmal District
Telangana Elections
Bagapur Panchayat
Local Body Elections
Sarpanch Election
America NRI Vote
Mutyala Sri Veda
Lokeswaram Mandal
One Vote Victory

More Telugu News