గిల్ ఫామ్‌పై ఆందోళన.. కానీ తప్పించలేం అంటున్న అశ్విన్

  • వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను తప్పించడం కష్టమన్న అశ్విన్
  • సిరీస్ మధ్యలో గిల్‌ను తొలగించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్య
  • గిల్‌కు ఐదు మ్యాచ్‌ల్లోనూ అవకాశం ఇవ్వాలని సూచన
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌‌కు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో గిల్ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, అతడిని జట్టు నుంచి తప్పించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు. గిల్ జట్టులో ఓపెనర్‌ మాత్రమే కాదని, వైస్ కెప్టెన్ కూడా అనే విషయాన్ని గుర్తుచేశాడు.

తన యూట్యూబ్ ఛానల్ ‘యాష్‌కి బాత్‌’ కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడుతూ, "శుభ్‌మన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్. అలాంటి ఆటగాడిని సిరీస్ మధ్యలో తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం అవుతుంది. గిల్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్‌ను తీసుకురావడం సరైనది కాదు. అలా చేస్తే ఒక ఆటగాడినే కాదు, వైస్ కెప్టెన్‌ను తొలగించినట్టు అవుతుంది" అని విశ్లేషించాడు.

వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశాక అతనికి పూర్తి అవకాశాలు ఇవ్వాలని అశ్విన్ సూచించాడు. "ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లోనూ అతడిని ఆడనివ్వాలి. అప్పటికీ గిల్ నుంచి సరైన ప్రదర్శన రాకపోతే అప్పుడు వైస్ కెప్టెన్సీ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చు" అని తెలిపాడు.

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జట్టు కూర్పుపై కూడా అశ్విన్ స్పందించాడు. "బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది, హర్షిత్ రాణా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆందోళన అంతా శుభ్‌మన్ గిల్ గురించే. అతడు పరుగులు చేయకపోతే జట్టులో ఉంటాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన స్థానం కాపాడుకోవడానికి గిల్ తప్పక రాణించాలి" అని అశ్విన్ పేర్కొన్నాడు.


More Telugu News