తండ్రి కళ్లెదుటే ప్రాణాలు విడిచిన కుమార్తె.. హయత్‌నగర్‌లో విషాదం

  • హయత్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
  • తండ్రితో కలిసి రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు
  • ప్రమాదంలో విద్యార్థిని ఐశ్వర్య మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు
  • మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో వైద్య విద్యార్థిని యంసాయని ఐశ్వర్య (22) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తండ్రి పాండు తీవ్రంగా గాయపడ్డారు. వైద్యురాలై ప్రజలకు సేవ చేయాలన్న ఆమె కల కల్లలయ్యింది.

వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఐశ్వర్య ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇవాళ‌ ఉదయం హయత్‌నగర్‌లోని ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతోంది. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లిద్దరూ తీవ్రంగా గాయపడి రోడ్డుపై కుప్పకూలిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమె తండ్రి పాండుకు మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు.

ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వివరాలను సేకరిస్తున్నారు. వైద్య విద్యార్థిని మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


More Telugu News