Delhi: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 100 విమానాల రద్దు

100 Flights Cancelled 300 Delayed Due To Delhi Smog
  • 'తీవ్ర' స్థాయికి చేరిన వాయు నాణ్యత సూచీ
  • వంద విమానాల రద్దు.. 300కి పైగా ఆలస్యం
  • ప‌లు రైళ్లు 6 నుంచి 7 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్న వైనం
  • నిర్మాణాలపై నిషేధం, ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్
  • ఢిల్లీకి 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
దేశ రాజధాని ఢిల్లీని ఈరోజు ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం 'తీవ్ర' స్థాయికి చేరడంతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో దృశ్యమానత (visibility) తగ్గింది. ఫలితంగా విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం, ఇవాళ‌ ఉదయం 6 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 456గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లోనే రెండో అత్యంత గరిష్ఠ స్థాయి. ఆదివారం ఏక్యూఐ 461గా నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అక్షర్‌ధామ్‌ వద్ద ఏక్యూఐ 493గా, బారాఖంబా రోడ్డులో 474గా నమోదైంది.

కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగమంచుతో ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు 100 విమానాలు రద్దు కాగా, 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు 90కి పైగా రైళ్లు 6 నుంచి 7 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. ప్రయాణానికి ముందు తమ విమాన సర్వీసుల వివరాలు తెలుసుకోవాలని కోరాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద అత్యంత కఠినమైన స్టేజ్-IV ఆంక్షలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ అయ్యాయి. 10వ తరగతి మినహా మిగిలిన తరగతులకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది.
Delhi
Delhi pollution
Delhi fog
Air Quality Index
AQI
Flight cancellations
Train delays
GRAP
CAQM
Delhi NCR

More Telugu News