Abhishek Sharma: వాళ్లిద్దరూ వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు గెలిపిస్తారు: అభిషేక్ శర్మ

Surya and Shubman will be match winners in World Cup says Abhishek Sharma
  • సూర్యకుమార్, గిల్‌పై పూర్తి నమ్మ‌కం ఉందన్న అభిషేక్ శర్మ
  • ప్రపంచకప్‌లో వాళ్లిద్దరూ మ్యాచ్‌లు గెలిపిస్తారని ధీమా
  • దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం
  • ఈ మ్యాచ్‌లో 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అభిషేక్
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో వీరిద్దరూ తక్కువ స్కోర్లకే పరిమితమైనప్పటికీ, రాబోయే ప్రపంచకప్‌లో వారే జట్టుకు మ్యాచ్‌లు గెలిపిస్తారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు.

ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన నిన్న‌టి మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గిల్ 28 పరుగులు చేయగా, సూర్యకుమార్ కేవలం 12 పరుగులకే ఔటయ్యాడు. అయితే, 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అభిషేక్ శర్మ, మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

"ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. నన్ను నమ్మండి. ప్రపంచకప్‌లోనూ, దానికి ముందు కూడా సూర్యకుమార్, శుభ్‌మన్ భారత్‌కు మ్యాచ్‌లు గెలిపిస్తారు. ముఖ్యంగా శుభ్‌మన్‌తో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ప్రత్యర్థి ఎవరైనా అతను రాణించగలడు. అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే అందరికీ ఆ నమ్మకం కలుగుతుంది" అని అభిషేక్ పేర్కొన్నాడు.

పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా అనుకూలించిందని, అందుకే పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి మంచి ఆరంభం ఇవ్వాలని భావించానని అభిషేక్ తెలిపాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం లక్నోలో జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే.
Abhishek Sharma
Suryakumar Yadav
Shubman Gill
T20 World Cup
India vs South Africa
Cricket
HPCA Stadium
Lucknow T20
Indian Cricket Team
T20 Series

More Telugu News