NRI: 100 కోట్లతో ఇండియాకు తిరిగొచ్చా.. కానీ జీవితం బోర్ కొడుతోంది: ఎన్నారై ఆవేదన

NRI With Rs 100 Crore Net Worth Returns To India Reflects On Post Retirement Life
  • అమెరికా నుంచి 100 కోట్ల సంపదతో భారత్‌కు తిరిగొచ్చిన ఎన్నారై
  • ఆర్థిక స్వేచ్ఛ లభించినా జీవితం బోర్ కొడుతోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి అంటున్న టెక్కీ
  • ఉద్యోగంలో మళ్లీ చేరలేను, ఏం చేయాలో తెలియడం లేదంటూ ఆవేదన
  • ఎన్నారై పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు
అమెరికాలో విజయవంతమైన కెరీర్ తర్వాత రూ.100 కోట్ల నికర సంపదతో భారత్‌కు తిరిగి వచ్చిన ఓ ఎన్నారై తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించినప్పటికీ, ముందస్తు రిటైర్మెంట్ జీవితంలో తనకు ఎదురవుతున్న మిశ్రమ భావాలను ఆయన రెడిట్ పోస్ట్‌లో వివరించారు. 

ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, మొదట ఓ సర్వీస్ కంపెనీలో చేరి, తర్వాత కోర్ టెక్నాలజీలోకి, ఆపై అమెరికాకు వెళ్లానని ఆయన తెలిపారు. అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా తన సంపదను పెంచుకున్నట్లు చెప్పారు. "గత కొన్నేళ్లుగా మా స్టాక్ పోర్ట్‌ఫోలియో అద్భుతంగా పెరిగింది. ప్రస్తుతం మా సంపద 12 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.100 కోట్లకు పైగా) చేరింది. ఈ సంఖ్యను నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆయన రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఇండియాలో ఉంటున్నానని, ఈ స్వేచ్ఛ ఎంతో బాగున్నా కొన్నిసార్లు సవాల్‌గా అనిపిస్తోందని ఆయన అన్నారు. ఓ మంచి గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తూ తన రోజువారీ జీవితం ఆరోగ్యం, కుటుంబం చుట్టూనే తిరుగుతోందని చెప్పారు. రోజూ కనీసం 3 గంటలు స్పోర్ట్స్ లేదా జిమ్‌లో గడపడం, పుస్తకాలు చదవడం, టీవీ సీరియళ్లు చూడటం, కుటుంబంతో సమయం గడపడం వంటివి చేస్తున్నట్లు వివరించారు.

అయితే, ఈ సౌకర్యవంతమైన జీవితమే కొన్నిసార్లు తనకు విసుగు, శూన్యతను మిగులుస్తోందని వాపోయారు. "కొన్నిసార్లు బోర్ కొడుతుంది. కానీ మళ్లీ టెక్ కంపెనీలో కష్టపడటాన్ని ఊహించుకోలేను. జీవితంలో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోవాలి. నా కుటుంబంతో గడిపే సంతోషం కోసం ఏ ప్రమోషన్లు, టైటిల్స్‌ను అయినా వదులుకోవడానికి నేను సిద్ధం" అని ఆయన పేర్కొన్నారు.

రెడిట్‌లోని ‘r/FatFIREIndia’ అనే గ్రూపులో ఆయన పెట్టిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. "త్వరగా రిటైర్ అయితే బోర్ కొట్టడం సహజం" అని ఒకరు కామెంట్ చేయగా, "మీకు నచ్చిన కొత్త హాబీ లేదా ఏదైనా పని నేర్చుకోండి" అని మరొకరు సలహా ఇచ్చారు. చాలా మంది ఆయన విజయాన్ని ప్రశంసిస్తూ, ముందస్తు రిటైర్మెంట్ వల్ల కలిగే మానసిక సవాళ్లపై చర్చిస్తున్నారు.
NRI
Indian NRI
Early Retirement
Financial Freedom
India Return
Reddit Post
FatFIREIndia
Investment Portfolio
Millionaire Life
Boredom

More Telugu News