TG Local Body Elections: ఎస్ఐ ఉద్యోగం వదిలి వచ్చినా.. సర్పంచ్‌గా గెలవలేకపోయిన వైనం

Venkateswarlu SI Fails to Win Sarpanch Election After VRS in Suryapet
  • గ్రామ సేవ కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా
  • సూర్యాపేట జిల్లా గుడిబండలో సర్పంచ్‌గా పోటీ
  • కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన వెంకటేశ్వర్లు
  • పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎస్ఐ
గ్రామానికి సేవ చేయాలన్న తపనతో ఓ పోలీసు అధికారి తన ఉద్యోగాన్నే వదులుకున్నారు. కానీ, ఓటర్లు మాత్రం ఆయనకు మొండిచేయి చూపించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చినా విజయం సాధించలేకపోయారు.

వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఎస్ఐగా పనిచేస్తున్నారు. తన పదవీ విరమణకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే, ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆయనకు మద్దతు పలికారు. ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేయడం, ప్రముఖ నేతల అండదండలు ఉండటంతో తన విజయం ఖాయమని వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు.

అయితే, ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు భిన్నంగా వెలువడ్డాయి. గుడిబండ గ్రామ ప్రజలు ఆయనకు పట్టం కట్టలేదు. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడంతో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఉద్యోగం వదులుకుని మరీ బరిలోకి దిగిన ఆయన నిర్ణయంపై ఇప్పుడు స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన నిబద్ధతను మెచ్చుకుంటుంటే, మరికొందరు ఇది తొందరపాటు నిర్ణయమంటూ అభిప్రాయ‌డుతున్నారు.
TG Local Body Elections
Venkateswarlu
Suryapet
Kodada
Gudibanda
Sarpanch Election
Telangana Elections
SI Resigns
Uttam Kumar Reddy
Padmavathi Reddy
Village Politics

More Telugu News