Buggana Rajendranath Reddy: మంత్రివర్గం ఆమోదం లేకుండానే కూటమి ప్రభుత్వం అప్పులు.. బుగ్గన ఫైర్

Buggana Rajendranath Reddy Fires at Coalition Govt Over Unapproved Loans
  • బేవరేజేస్‌ కార్పొరేషన్‌ బాండ్లతో రూ.5,750 కోట్ల రుణం సేకరించారన్న బుగ్గన
  • తమ హయాంలో తాము ఇదే చేస్తే రాద్ధాంతం చేశారన్న బుగ్గన
  • అప్పుల విషయంలో కూటమి నేతలు నటిస్తున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను తాకట్టు పెట్టి, 9 శాతానికి పైగా వడ్డీతో రూ.5,750 కోట్లు రుణం సమీకరించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇదే బేవరేజెస్ బాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. మద్యం ఆదాయాన్ని హామీగా పెట్టి అప్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ నుంచి జీవో, క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం బాండ్లకు ఎలా గ్యారెంటీ ఇస్తుందని బుగ్గన ప్రశ్నించారు.

అప్పుల విషయంలో కూటమి నేతలు నటులను మించిపోయారని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే రూ.40 వేల కోట్ల అప్పు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు దాచిపెట్టి, తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
Buggana Rajendranath Reddy
Andhra Pradesh
Coalition Government
AP Beverages Corporation
Loans
Debt
Finance
Amaravati
YSRCP

More Telugu News