Celine Cremer: టాస్మేనియా అడవుల్లో యువతి మిస్సింగ్.. రెండేళ్లకు దొరికిన ఫోన్‌తో కొత్త ఆశలు

Celine Cremer Missing in Tasmania Forest Mobile Phone Found After Two Years
  • ఆస్ట్రేలియాలో రెండేళ్ల క్రితం అదృశ్యమైన బెల్జియం మహిళ
  • ఆమె స్నేహితులు నిర్వహించిన గాలింపులో దొరికిన మొబైల్ ఫోన్
  • మళ్లీ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
  • షార్ట్‌కట్ కోసం ప్రయత్నించి దారి తప్పిపోయిందని అనుమానం
ఆస్ట్రేలియాలోని టాస్మేనియాలో రెండేళ్ల క్రితం తప్పిపోయిన బెల్జియం యువతి కేసులో కీలక పురోగతి లభించింది. తాజాగా ఆమె మొబైల్ ఫోన్ దొరకడంతో నిలిచిపోయిన గాలింపు చర్యలను పోలీసులు తిరిగి ప్రారంభించారు. సెలిన్ క్రీమర్ అనే బెల్జియం మహిళ జూన్ 2023లో ఫిలాసఫర్ ఫాల్స్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదృశ్యమైంది. అప్పట్లో పోలీసులు ఆమె కారును గుర్తించినా, ఎంత గాలించినా ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు తాజాగా స్వయంగా గాలింపు చేపట్టారు. బెల్జియం నుంచి వచ్చిన ఆమె స్నేహితులు శనివారం గాలిస్తుండగా, గతంలో అధికారులు వెతికిన ప్రదేశంలోనే సెలిన్ మొబైల్ ఫోన్‌ను కనుగొన్నారు.

ఈ విషయాన్ని నిర్ధారించిన పోలీసులు, ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. "చీకటి పడుతుండటంతో సెలిన్ తన కారు వద్దకు త్వరగా వెళ్లేందుకు ఫోన్‌లోని యాప్ సహాయంతో షార్ట్‌కట్ మార్గంలో వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ క్రమంలో ఆమె ఫోన్ జారవిడుచుకుని, దట్టమైన అడవిలో దారి తప్పిపోయి ఉండొచ్చు" అని ఇన్‌స్పెక్టర్ ఆండ్రూ హాన్సన్ మీడియాకు వివరించారు.

సెలిన్ జూన్ 17, 2023న చివరిసారిగా కనిపించారు. ఆమె అదృశ్యమైన తర్వాత అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయని, అంతకాలం పాటు ఆమె బతికి ఉండే అవకాశాలు లేవని పోలీసులు అప్పట్లో అంచనా వేశారు. ఇప్పుడు ఫోన్ లభ్యం కావడంతో ఈ కేసులో కొత్త ఆశలు చిగురించాయి. స్నేహితులు ప్రారంభించిన ఈ గాలింపులో పోలీసులు కూడా అధికారికంగా పాలుపంచుకుంటున్నారు.
Celine Cremer
Tasmania
missing person
Belgium woman
Philosopher Falls
Australia
Tasmania forest
mobile phone found
search operation
forest

More Telugu News