Thaman: మన మధ్య యూనిటీ లేదు: తమన్

Thaman Expresses Concern Over Lack of Unity in Telugu Film Industry
  • తెలుగు సినీ పరిశ్రమకు దిష్టి తగిలిందన్న తమన్
  • సోషల్ మీడియాలో నెగెటివిటీ బాగా పెరిగిపోయిందని వ్యాఖ్య
  • ఇండస్ట్రీలో ఐక్యత లోపించిందని ఆవేదన
తెలుగు సినీ పరిశ్రమకు దిష్టి తగిలిందని, సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటూ ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఐక్యత కొరవడిందని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'అఖండ 2: తాండవం' చిత్ర విజయోత్సవ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. "యూట్యూబ్, సోషల్ మీడియా తెరిస్తే చాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మన తెలుగు పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇంత మంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు మరెక్కడా లేరు. అలాంటిది మనలో మనం ఐక్యత లేకుండా ఉండటం బాధాకరం," అని అన్నారు.

తమ సినిమా విడుదల సమయంలో చివరి నిమిషంలో ఎదురైన అడ్డంకులను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. "సినిమాను ఆపాలనుకుంటే ముందే చేయొచ్చు. కానీ చివరి నిమిషంలో అడ్డుకోవడం వెనుక ఉద్దేశం స్పష్టమవుతోంది. ఇలాంటివి చూస్తుంటే మన మధ్య ఐక్యత లేదని అర్థమవుతోంది. కష్టాల్లో ఉన్న నిర్మాతకు అండగా నిలవాలి కానీ, బయట సలహాలు ఇవ్వడం సరికాదు," అని పేర్కొన్నారు.

ప్రతి సినిమాను తమ సినిమాగా భావించాలని సూచించారు. "ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్-ఎయిడ్ వేయండి, అంతేకానీ బయటకు వెళ్లి బ్యాండ్ వేయకండి," అంటూ హితవు పలికారు. బాలకృష్ణ, బోయపాటిల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని, అది తెరపై ఫిజిక్స్ రూపంలో కనిపిస్తుందని చమత్కరించారు. సంక్రాంతికి రాబోయే సినిమాలన్నీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఏ సినిమానైనా ప్రోత్సహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తమన్ స్పష్టం చేశారు. 
Thaman
SS Thaman
Telugu film industry
Akhanda 2
Boyapati Srinu
Balakrishna
Tollywood unity
Telugu cinema
movie promotions
film industry

More Telugu News