అమెరికా వీసా ఇంటర్వ్యూలకు కొత్త చిక్కు.. ఇక సోషల్ మీడియాపైనా నిఘా.. భారతీయ నిపుణులపై ప్ర‌భావం?

అమెరికా వీసా ఇంటర్వ్యూలకు కొత్త చిక్కు.. ఇక సోషల్ మీడియాపైనా నిఘా.. భారతీయ నిపుణులపై ప్ర‌భావం?

H1B Visa Applicants Face Social Media Scrutiny in US Visa Interviews
  • హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుదారులకు కొత్త నిబంధనలు
  • సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టనున్న అమెరికా
  • ప్రొఫైల్స్‌ను పబ్లిక్‌గా ఉంచాలని దరఖాస్తుదారులకు ఆదేశం
  • జాతీయ భద్రతే కారణమంటున్న అమెరికా విదేశాంగ శాఖ
  • భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. హెచ్‌-1బీ (H-1B) వీసాతో పాటు దానిపై ఆధారపడిన హెచ్‌-4  (H-4) వీసా దరఖాస్తుదారుల స్క్రీనింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే విద్యార్థులు (F, M), ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (J) వీసాలకు ఈ నిబంధన అమల్లో ఉండగా, ఇప్పుడు దానిని హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలకు కూడా విస్తరించారు. ఈ తనిఖీలకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను 'పబ్లిక్'గా మార్చుకోవాలని విదేశాంగ శాఖ స్పష్టంగా సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పటికే భారత్‌లో పలువురి హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అమెరికా వీసా అనేది ఒక హక్కు కాదని, అదొక సదుపాయం మాత్రమేనని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశ జాతీయ భద్రత, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించేందుకే ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపింది. ప్రతి వీసా జారీ ప్రక్రియను ఒక జాతీయ భద్రతాపరమైన నిర్ణయంగానే పరిగణిస్తామని పేర్కొంది.

వలసలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగానే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వీసాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయ టెక్ నిపుణులు, వైద్యులు అధిక సంఖ్యలో ఉన్నారు. తాజా నిర్ణయం వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Advertisement
H-1B Visa
US Visa
United States
Indian professionals
H-4 Visa
Social media screening
Trump administration
Visa interviews
Immigration
US foreign policy

More Telugu News