Punugu Pilli: కరీంనగర్‌లో ప్రత్యక్షమైన అరుదైన పునుగు పిల్లి

Rare Civet Cat Rescued in Karimnagar Shifted to Deer Park
  • క్షేమంగా పట్టుకుని డీర్‌పార్క్‌కు తరలించిన అటవీ సిబ్బంది
  • అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు
  • శ్రీవారి అభిషేకంలో దీని తైలానికి ఎంతో ప్రాముఖ్యత
  • శేషాచలం అడవుల్లో ఎక్కువగా కనిపించే అరుదైన జీవి
తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగు పిల్లి కరీంనగర్‌ పట్టణంలో ప్రత్యక్షమైంది. ఆదివారం ఉదయం హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఈ పునుగు పిల్లి కనిపించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నారు. అనంతరం దానిని స్థానిక డీర్‌పార్క్‌కు తరలించారు. పునుగు పిల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, డీర్ పార్క్‌లో దానికి వైద్యం చేయిస్తామని ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి నర్సింగరావు తెలిపారు. అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అటవీ ప్రాంతంలో వదలిపెడతామని చెప్పారు. 

పునుగు పిల్లి ప్రత్యేకత
పునుగుపిల్లి (Civet Cat) అనేది పిల్లి జాతికి చెందినదిగా కనిపించినా, ఇది వివెరా కుటుంబానికి చెందిన అరుదైన క్షీరదం. రాత్రిపూట సంచరించే ఈ జీవులు దట్టమైన అడవుల్లో నివసిస్తాయి. దీని శరీరం నుంచి వెలువడే 'పునుగు తైలం'ను సుగంధ ద్రవ్యాల తయారీలో, ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో పవిత్రంగా వినియోగిస్తారు. అంతేకాకుండా, ఈ పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారుచేసే 'కోపి లువాక్' కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా అడవుల్లో ఉండే ఈ జీవులు ఇటీవల తరచుగా కరీంనగర్ వంటి పట్టణ ప్రాంతాల్లో కనిపించడం గమనార్హం.
Punugu Pilli
Civet Cat
Karimnagar
Deer Park
Tirumala
Sesachalam Hills
Kopi Luwak Coffee
Forest Department

More Telugu News