Revanth Reddy: పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా.. రెండో విడతలోనూ అదే జోరు!

Congress Party Wins Big in Telangana Panchayat Elections Under Revanth Reddy
  • సగానికి పైగా సర్పంచ్ స్థానాలు హస్తం కైవసం
  • గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్
  • సిద్దిపేట, జనగామ వంటి జిల్లాల్లో గులాబీ పార్టీ పట్టు
  • చలిని లెక్కచేయకుండా భారీగా పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు
తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.

మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు 2,200కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చి 1,100కు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ సుమారు 250 స్థానాలకే పరిమితమైంది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో మెజారిటీ జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే సిద్దిపేట, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది.

తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 85.86 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిన్న సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి, గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను అధికారులు ప్రకటించారు.
Revanth Reddy
Telangana panchayat elections
Congress party
BRS party
Village elections
Telangana politics
Harish Rao
BJP Telangana
Local body elections
Telangana Gram Panchayat

More Telugu News