Aiden Markram: చెలరేగిన టీమిండియా బౌలర్లు... 117 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్

India vs South Africa Indian Bowlers Shine South Africa All Out for 117
  • మూడో టీ20లో టీమిండియా బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల
  • 20 ఓవర్లలో 117 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
  • కెప్టెన్ మార్‌క్రమ్ (61) ఒంటరి పోరాటం
  • అర్ష్‌దీప్, హర్షిత్, వరుణ్, కుల్దీప్‌కు తలా రెండేసి వికెట్లు
  • భారత్ విజయ లక్ష్యం 118 పరుగులు
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ఫలితంగా, దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (61) ఒంటరి పోరాటం చేయడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు ఆరంభం నుంచే వికెట్ల వేట ప్రారంభించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), రీజా హెండ్రిక్స్ (0) సహా డివాల్డ్ బ్రెవిస్ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో సఫారీ జట్టు 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ మార్‌క్రమ్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడి 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అతనికి డొనోవాన్ ఫెరీరా (20) నుంచి కాస్త సహకారం లభించింది. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేయలేకపోయింది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, వరుణ్ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వారితో పాటు హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ కూడా తలా రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరొక వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ గెలవాలంటే భారత్ 118 పరుగులు చేయాల్సి ఉంది.
Aiden Markram
South Africa vs India
IND vs SA
Dharamshala T20
Arshdeep Singh
Varun Chakravarthy
Kuldeep Yadav
Indian bowlers
South Africa batting collapse

More Telugu News