Pushkar Singh Dhami: మదనపల్లెలో వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

Pushkar Singh Dhami unveils Vajpayee statue in Madanapalle
  • అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
  • కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
  • వాజ్‌పేయి ఆశయాలను ప్రధాని మోదీ ముందుకు తీసుకెళుతున్నారని వ్యాఖ్య
  • ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబును ప్రశంసించిన ధామి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ఆవిష్కరించారు. బీజేపీ చేపట్టిన 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

వాజ్‌పేయి శత జయంతి సంవత్సరంలో ఏపీ బీజేపీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని ధామి అన్నారు. వాజ్‌పేయి జాతీయవాదం, ప్రజాస్వామ్య విలువలు, మానవతావాదానికి ప్రతీకగా నిలిచిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన హయాంలో పోఖ్రాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, టెలికాం విప్లవం వంటి చరిత్రాత్మక విజయాలు దేశం సాధించిందని గుర్తుచేశారు. జాతీయ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు రాజకీయ భేదాలను ఎలా అధిగమించవచ్చో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి నిరూపించారని తెలిపారు.

వాజ్‌పేయి ఆశయాలే ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు స్ఫూర్తి అని ధామి పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిర్మూలన, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలు 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' దార్శనికతను బలపరిచాయని వివరించారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ధామి ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు, రాబోయే పారిశ్రామిక, సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుపై అభినందనలు తెలిపారు. వాజ్‌పేయి స్ఫూర్తితోనే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిందని, నేడు ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో తమ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
Pushkar Singh Dhami
Atal Bihari Vajpayee
Madanapalle
Andhra Pradesh
Uttarakhand CM
BJP
Narendra Modi
Chandrababu Naidu
Polavaram Project

More Telugu News